Hyderabad: పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలంటే ఏ రెస్టారెండ్ కో లేదా హోటల్ లోనే లేక ఇంట్లోనో జరుపుకోవడం సాధారణమే. కానీ ఓ వ్యక్తి రోడ్డునే బర్త్ డే వేడుకకు అడ్డాగా చేసుకున్నాడు. రోడ్డును ఆక్రమించి వేదిక ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో వచ్చిపోయే వారికి ఇబ్బందులు కలిగాయి. దీనిపై ఫిర్యాదు కూడా అందడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. దీంతో చివరకు అతడు కటకటాలపాలయ్యాడు. బర్త్ డేను ఎంత ఘనంగా జరుపుకోవాలనుకున్నా ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదు. మన దేశంలో ఉన్న చట్టాల వల్ల కావచ్చు ఎవరైనా సులభంగా నిబంధనలు అతిక్రమించడం ఈ మధ్య ఫ్యాషన్ గా మారింది.

తాజాగా హైదరాబాద్ నగరంలో నవంబర్ 13న సంతోష్ నగర్ లోని దర్గా బర్హానా షా ప్రాంతంలో మాజీద్ అలీఖాన్ అనే వ్యక్తి తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ప్రధాన రహదారిపై వేదికను ఏర్పాటు చేశాడు. స్నేహితులు, కుటుంబసభ్యులను ఆహ్వానించాడు. కార్యక్రమానికి డీజే కూడా ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో వారు వచ్చి వేదిక తీసేయాల్సిందిగా సూచించారు. అయినా వినకపోవడంతో అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచారు.
ప్రజా ఆస్తులు వారి సొంతవిగా భావిస్తున్నారు. తమను ఎవరు అడ్డుకుంటారో చూస్తామనే భావనతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజలకు అడ్డంకులు కల్పిస్తూ రోడ్డుకు అడ్డంగా వేదిక ఏర్పాటు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. నీకు డబ్బు ఉంటే ఏ హోటల్ లోనే ఏర్పాటు చేసుకోవాలి. కానీ నడిరోడ్డు ఏమైనా నీ అబ్బ జాగీరా అని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ప్రజలకు కంటకంగా ప్రవర్తిస్తే ఎవరికైనా కటకటాలే దిక్కు అవుతాయనే సంగతి తెలిసినా ఎందుకో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

పుట్టిన రోజు వేడుకపై రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మాజీద్ అలీ, డీజే నిర్వాహకుడు ప్రభాకర్ లపై కేసు నమోదు చేశారు. రోడ్డుకు అడ్డంగా వేదిక ఏర్పాటు చేయడంతో వారిని కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారించిన న్యాయమూర్తి నిందితులిద్దరికి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. అనంతరం వారిని చంచల్ గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. రోడ్డుకు అడ్డంగా అనుమతి లేకుండా వేదిక ఏర్పాటు చేసినందుకు వారికి శిక్ష పడింది. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు ఎవరు తీసుకున్నా చట్టపరంగా శిక్షార్హులవుతారు.