
Bigg Boss Jhiva Jyothi: సోషల్ సెంటిమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దేవుళ్లకు సంబంధించిన సాంప్రదాయాలు, పద్ధతులు వంటివి తప్పక పాటించాలి. ఆ మధ్య హీరోయిన్ నయనతార తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయనతార తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. మాడ వీధుల్లో ఆమె చెప్పులతో సంచరించారు. ఆ ఫోటోలు బయటకు రావడంతో వివాదం రాజుకుంది. జనాలు నయనతార మీద మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ చర్యలకు సిద్ధమైంది. నవదంపతులు నయనతార-విగ్నేష్ క్షమాపణలు చెప్పారు. తెలియక చేసిన పొరపాటని వేడుకోవడంతో వదిలేశారు.
తాజాగా ఇదే తరహా విమర్శలను బుల్లితెర సెలబ్రిటీ శివ జ్యోతి ఎదుర్కొన్నారు. ఓ ఆలయ ప్రాంగణంలో చెప్పులతో సంచరిస్తున్న శివ జ్యోతి ఫోటోలు చూసిన హిందూ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయంలో పాదరక్షలతో తిరగకూడదన్న కనీస జ్ఞానం లేదా అని విమర్శిస్తున్నారు. భర్తతో పాటు శివ జ్యోతి థాయిలాండ్ టూర్ కి వెళ్ళింది. అక్కడ ఒక హిందూ దేవాలయాన్ని ఆమె సందర్శించారు. వారి దేవాలయ సందర్శన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆమెను తప్పుబడుతున్నారు. మరి ఈ వివాదం మీద శివ జ్యోతి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. శివ జ్యోతి తీన్ మార్ షోతో బాగా పాపులర్ అయ్యారు. బిత్తిరి సత్తితో పాటు ఆమె సోషల్, పొలిటికల్ సెటైరికల్ షో చేశారు. ఆ షోలో సావిత్రిగా ఆమె గుర్తింపు రాబట్టారు. తీన్ మార్ షోతో శివ జ్యోతి, బిత్తిరి సత్తి ఫేమస్ అయ్యారు. ఆ ఫేమ్ తో శివ జ్యోతి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనే ఛాన్స్ దక్కించుకున్నారు.

నాగార్జున హోస్ట్ గా 2019 లో ప్రసారమైన బిగ్ బాస్ షో ఆమె కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. శివ జ్యోతి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. కేవలం ఫినాలే ఎపిసోడ్ కి ముందు ఎలిమినేటైన శివ జ్యోతి, 99 రోజులు హౌస్లో ఉన్నారు. రాహుల్ సిప్లిగంజ్ ఆ సీజన్ విన్నర్ అయ్యారు. శ్రీముఖి రన్నర్ పొజిషన్ తో సరిపెట్టుకుంది. ఇటీవల శివ జ్యోతి హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ఈ ఇంటి నిర్మాణం విషయంలో మోసం చేశారంటూ శివ జ్యోతి ఆ మధ్య ఆవేదన చెందారు.
