Bigg Boss 6 Telugu TRP Rating: బిగ్ బాస్ సీజన్ 6 ప్లాప్ అని మొదటి నుండి వినిపిస్తున్న మాట. ఫినాలేకి వచ్చిన టీఆర్పీతో అది పూర్తిగా రుజువైంది. గ్రాండ్ ఎపిసోడ్ అంచనాలు అందుకోలేకపోయింది. వీకెండ్ ఎపిసోడ్స్ కంటే రెండు మూడు పాయింట్స్ ఎక్కువ టీఆర్పీ తెచ్చుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ తెలుగు 6 ఫినాలే ఎపిసోడ్ 6 కి కొంచెం అటూ ఇటూగా టీఆర్పీ రాబట్టిందట. గత ఐదు సీజన్ తో పోల్చితే ఇది అత్యంత తక్కువ. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న ఫస్ట్ సీజన్ ఫినాలే టీఆర్పీ 14.2. అప్పటికి షో పట్ల ఆడియన్స్ లో ఆదరణ లేదు. పెద్దగా అవగాహన కూడా లేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ తన హోస్టింగ్ స్కిల్స్ తో షోకి విపరీతమైన ఆదరణ ఇచ్చారు.

ఐదు సీజన్స్ ఫినాలే ఎపిసోడ్స్ లో 14 టీఆర్పీ కంటే తక్కువ వచ్చింది లేదు. బిగ్ బాస్ సీజన్ 4 రికార్డు టీఆర్పీ రాబట్టింది. లాంఛింగ్ ఎపిసోడ్ తో పాటు ఫినాలే ఎపిసోడ్ భారీ ఆదరణ దక్కించుకుంది. సీజన్ 4 ఫినాలే టీఆర్పీ 21.7 గా ఉంది. ఆ లెక్కన 6 టీఆర్పీ తెచ్చుకున్న సీజన్ 6 ఎక్కడ ఉందో అంచనా వేయవచ్చు. లేటెస్ట్ సీజన్ వీకెండ్ ఎపిసోడ్స్ టీఆర్పీ 3కి కొంచెం అటూ ఇటుగా వచ్చింది. రవితేజ, నిఖిల్ వంటి హీరోలు వచ్చినా… ఊర్వశి రాతెలా లాంటి బాలీవుడ్ భామతో పెర్ఫార్మన్స్ చేయించినా ఎలాంటి ఫలితం లేదు.
విన్నర్ ని నిర్ణయించిన విధానం కూడా ఫినాలేను భారీగా దెబ్బతీసింది. సూట్ కేసు వ్యవహారం టాప్ 3 కంటెస్టెంట్ తోనే ముగియాలి. టాప్ టు కంటెస్టెంట్స్ ని ప్రలోభాలకు గురి చేసి విన్నర్ ని డిసైడ్ చేయడం చెత్త నిర్ణయం. అది కూడా విన్నర్ ప్రైజ్ మనీలో 80% రూ. 40 లక్షలు తీసుకొని ఒకరు టైటిల్ రేసు నుంచి తప్పుకోవచ్చని చెబితే ఆటలో మజా ఏం ఉంటుంది. రిస్క్ ఎందుకని శ్రీహాన్, రేవంత్ చెరో సగం పంచుకున్నట్లు అయ్యింది.

టాప్ టు కంటెస్టెంట్స్ ఇద్దరి చేతులు పట్టుకొని హోస్ట్ విన్నర్ ని ప్రకటించే ఉత్కంఠ ఘట్టం కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారు. శ్రీహాన్ రూ. 40 లక్షలు తీసుకోవడంతో విన్నర్ ఎవరో చప్పగా తెలిసిపోయింది. దీంతో జనాలు వేరే ఛానల్ కి వెళ్లిపోయారు. లేదంటే టీవీ కట్టేసి పడుకున్నారు. చేజేతులా నిర్వాహకులు అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికలతో షోని దెబ్బతీశారు. భారీగా పెట్టుబడి పెట్టిన బిగ్ బాస్ సీజన్ 6 ఫెయిల్ కాగా… సీజన్ 7కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.