spot_img
Homeట్రెండింగ్ న్యూస్Bear Attack: సిక్కోలులో ఎలుగుబంటి రక్తపాతం

Bear Attack: సిక్కోలులో ఎలుగుబంటి రక్తపాతం

Bear Attack: శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఇద్దరి ప్రాణాలను తీసింది. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఆసుపత్రిలో కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు. వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లిలో జీడి తోటల్లో పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఉన్న మరొకరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఉద్దానంలో జీడిపిక్కల సేకరణ సమయం ఇది. దీంతో అనకాపల్లికి చెందిన అప్పికొండ కూర్మారావు, సిడిపల్లి లోకనాథం జీడి తోటలో పిక్కల సేకరణకు వెళ్లారు. అక్కడ పిక్కలు సేకరిస్తుండగా ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ హఠాత్ పరిణామంతో వారు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. కానీ తీవ్ర స్థాయిలో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పక్క తోటల్లో పనిచేస్తున్న వారు గమనించి కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకరు గాయాల పాలయ్యారు. ఈ ఘటనతో ఉద్దానంలో విషాదం అలుముకుంది. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉంది. ముఖ్యంగా ఉద్దానం, తీర ప్రాంతాల్లో నిత్యం ఎలుగుబంట్లు తిరుగుతుంటాయి. తితలి తుఫానులో ఉద్దానంలో ఉన్న చెట్లు, వృక్ష సంపద నేలమట్టం అయ్యింది. దీంతో వన్యప్రాణులు తలదాచుకునేందుకు వీలు లేకుండా పోతోంది. అందుకే వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాలి మండలాల్లో ఎలుగుబంట్ల సంచారం అధికంగా ఉంటుంది. గతంలో మనుషులపై దాడి చేసి ప్రాణాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఉద్దానం ప్రజలు కోరుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version