
Bandi Sanjay Released: టెన్త్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ కుట్ర కేసులో మంగళవారం అర్ధరాత్రి అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ శుక్రవారం విడుదలయ్యారు. ప్రివెంట్ అరెస్ట్ పేరుతో సంజయ్‌ను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బలవంతంగా బండిని అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు తర్వాత ఆయనను యాదాద్రి భువనగరి జిల్లాలో బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత నాటకీయ పరిణామాల మధ్య వరంగల్‌కు తీసుకొచ్చారు. పొద్దుపోయాక హనుమకొండ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను బుధవారం రాత్రి కరీంనగర జైలుకు తరలించారు.
బెయిల్ కోసం 8 గంటల వాదనలు..
గురువారం సంజయ్ బెయిల్ పిటిషన్‌పై హనుమకొండ కోర్టులో వాదనలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన వాదనలు రాత్రి 9 గంటల వరకు జరిగాయి. అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఇటు సంజయ్ తరఫున బీజేపీ తరపున లీగల్‌టీం వాదనలు వినిపించాయి. ఒక దశలో తీర్పు వాయిదా పడుతుందన్న సమాచారం బయటకు వచ్చింది. కానీ, బీజేపీ న్యాయవాదులు తీర్పు ఇవ్వాలని పట్టుబట్టారు. లేదా బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కోరారు. దీంతో పలు దఫాలుగా చర్చించిన న్యాయమూర్తి చివరకు సంజయ్ న్యాయమూర్తుల వాదనతో ఏకీబవించి బెయిల్ మంజూరు చేశారు. ఇక కస్టడీ పిటిషన్‌ను జడ్జి సోమవారానికి వాయిదా వేశారు.

షరతులతో బెయిల్..
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం కరీంనగర్ జైలు నుండి విడుదలయ్యారు. గురువారం హన్మకొండ కోర్టు బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరి జామీనుతోపాటు రూ. 20 వేల పూచీకత్తుతో బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కోర్టు ఆదేశాల మేరకు బండి సంజయ్ తరపు న్యాయవాదులు పూచీకత్తులను సమర్పించారు. దీంతో ఇవాళ ఉదయం కరీంనగర్ జైలు నుండి బండి సంజయ్ ను విడుదల చేశారు. దేశం విడిచి వెళ్లొద్దని, సాక్షులను ప్రభావింత చేయొద్దని సంజయ్‌కు కోర్టు షరతులు విధించింది.
కేసీఆర్ కుటుంబం, వరంగల్ సీపీపై తీవ్ర వ్యాఖ్యలు..
జైలు నుంచి విడుదల అయిన తర్వాత బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీశ్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ తనపై కుట్రచేశారని చెప్పారు. జైలు తనకు కొత్త కాదని, మళ్లీ కూడా వస్తానని లోపల చెప్పి వచ్చానని వెల్లడించారు. ప్రజాసమస్యలపై పోరాటంలో ఎన్నిసార్లు అయినా జైలుకు వెళ్తానన్నారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక తనపై మోపిన కేసులో వరంగల్ సీపీ రంగనాథ్ ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు సింహాలపై ప్రమాణం చేసి చెప్పాలన్నారు. లీకేజీకీ కాదని ముందురోజు.. కుట్ర ఉందని మరుసటి రోజు మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలన్నారు. పోలీసులే రంగనాథ్ తీరును వ్యతిరేకిస్తున్నారని వివరించారు.