
Rahul Gandhi- PM Modi: రాహుల్ గాంధీ.. చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. సూరత్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. పార్లమెంటు తీసుకున్న చర్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నీయాంశమవుతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు మోదీని విమర్శిస్తున్నాయి. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంలో మోడీ రాజకీయ హుందాతనాన్ని ప్రదర్శించలేకపోయాడని ధ్వజమెత్తుతున్నాయి. మోడీకి బొత్తిగా రాజకీయ పరిణితి లేకుండా పోయిందని, రాహుల్ గాంధీని చూసి భయపడుతున్నాడని ఆరోపిస్తున్నాయి. ఇదే అనుకూల సమయం అనుకొని మోదీని తిడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని జీవం లేకుండా చేసిన కేసీఆర్ సైతం రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు తన నమస్తే తెలంగాణలో మోడీని తిట్టేందుకు ఏకంగా నాలుగు పేజీలు కేటాయించాడు. నిన్న మోడీని తిడుతూ ఒక లేఖ కూడా విడుదల చేశాడు.. కెసిఆర్ కూడా ప్రజాస్వామ్య విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుతున్నాడంటేనే హాస్యాస్పదంగా కనిపిస్తోంది.. కనీసం ఒక ధర్నా చౌక్ లేని రాష్ట్రాన్ని తయారు చేసిన అతడు, ఈటెల రాజేందర్ లాంటి వారిని బయటకు పంపిన అతడు…ఇప్పుడు విలువల గురించి వల్లె వేయడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది.
నిరసన వరకే పరిమితం
ఇక రాహుల్ గాంధీ పరిణామంపై కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. యాంటి బీజేపీ దిశలో ఒక అవకాశం కాబట్టి మోడీ వ్యతిరేక నాయకులు మొత్తం రచ్చ రచ్చ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. వీరంతా కూడా అక్కడి వరకే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి వీరంతా మద్దదారులు కాదు. ఇది రాహుల్ గాంధీ ఆదరణ పెరగడానికి ఉపయోగపడుతుందని అనుకోవడానికి లేదు. వాస్తవానికి రాహుల్ గాంధీ పార్లమెంటులో ఉంటే బిజెపికి వచ్చిన నష్టం లేదు.. కాకపోతే మోడీ ఇంత వేగంగా స్పందించి, స్పీకర్ కార్యాలయం ద్వారా రాహుల్ పై వేటు వేయించేందుకు చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని గురించి పట్టించుకోలేదు. అస్తమానం రాహుల్ గాంధీ మోదిని ఏమన్నాడు? మోడీ మంచోడు కాదు, బిజెపికి విలువలు లేవు అనే కోణంలోనే వార్తలు రాసుకొచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కొన్ని కొన్ని సైట్లే నయం!
మోడీ అనుకున్నట్టే జరిగింది
మోడీ ఇప్పటికిప్పుడు ఆశిస్తున్న తక్షణ ప్రయోజనం ఆదానీ ఇష్యూ అర్జెంటుగా పక్కకు పోవాలి. ఎందుకంటే, తనకూ ఆదానికి మధ్య ఉన్న సాన్నిహిత్యం, ఆదానిని తాను వెనకేసుకొస్తున్న వైనం ప్రజల్లో చర్చకు దారితీస్తుంది కాబట్టి… వారి దృష్టిని మళ్లించాలి. మోడీ అనుకున్నట్టే రాహుల్ గాంధీ మాటలు తెరపైకి వచ్చాయి.. ప్రణవ్ మోదీ సూరత్ కోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. మోడీ అనుకున్నట్టే తీర్పు కూడా వచ్చింది..ఆఫ్ కోర్స్ మోడీ కూడా రాజకీయ నాయకుడే కదా.. బిజెపి కూడా రాజకీయ పార్టీనే. కెసిఆర్ చెబుతున్నట్టు అదే అహోబిలం మఠం కాదు కదా!
ఊదు కాలింది లేదు. పీరీ లేచింది లేదు
ఫర్ సపోజ్.. రేపు యూపీఏ కూటమి మంచి స్థానాలు సంపాదించి.. అధికారంలోకి వస్తే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు.. మరోవైపు ఇక మమత, అఖిలేష్, కేసీఆర్ కాంగ్రెసేతర, బీజేపేతర కూటమి కడతామని ఉవ్విళ్లూరుతున్నారు. కానీ అక్కడ ఊదు కాలింది లేదు. పీరీ లేచింది లేదు. వాళ్ళ రాష్ట్రాల్లోనే వాళ్లకు సమస్యలున్నాయి. వీరేం చేయగలరు? మోడీనేం నిలువరించగలరు? ఒకవేళ యూపీఏ కి మంచి సంఖ్యలో సీట్లు వస్తే.. ఈ సో కాల్డ్ థర్డ్ ఫ్రంట్ నుంచి మద్దతు తీసుకోవడమో, ఆ పార్టీలను ఆ కూటమి నుంచి విడదీయడమో లేదా పలు పార్టీలే కూటమి నుంచి బయటపడటమో తప్పనిసరి.. సో అసలు రాహుల్ ను అనర్హుడుని చేస్తే.. మోడీ ఇదే అనుకున్నాడు. అదే జరిగింది.
తొందరపాటు వెనుక..
ఇక ఈ వ్యవహారంలో మోడీ తొందరపాటు వెనుక ఓ కారణం ఉంది. స్పీకర్ కార్యాలయం వెంటనే స్పందించకపోతే.. కాంగ్రెస్ లీగల్ టీం హైకోర్టును ఆశ్రయిస్తుంది. సూరత్ కోర్టు తీర్పు అమలు మీద స్టే తీసుకొస్తుంది. ఇప్పుడు స్పీకర్ కార్యాలయం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే స్పీకర్ కార్యాలయం వెంటనే స్పందించింది.
మోడీ.. ఒక అవకాశం గా తీసుకుంటాడు..
కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సూరత్ కోర్టు తీర్పును రద్దు చేస్తే లేదా సుప్రీంకోర్టు కనుక కొట్టి పారేస్తే.. దానిని మళ్లీ మోడీ ఒక అవకాశం గా తీసుకుంటాడు. సుప్రీం కొలీజియం విధానాన్ని మోడీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జడ్జిల నియామకంపై నేషనల్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చట్టం తేవాలని చూస్తోంది. దీనిని జానే దాన్ అని సుప్రీంకోర్టు అంటున్నది. ఇదే క్రమంలో పార్లమెంటు చేసిన చట్టం అనే వ్యాజ్యాన్ని వేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు. దానిని కోర్టులో వేసినా ఉపయోగం లేదని కేంద్ర ప్రభుత్వానికీ తెలుసు.. ఈ క్రమంలోనే ఉపరాష్ట్రపతి, కేంద్ర న్యాయశాఖ మంత్రి సుప్రీంకోర్టు తీరును విమర్శిస్తున్నారు.. ఈ స్థితిలో రాహుల్ గాంధీ పై అనర్హత వేటుని సుప్రీంకోర్టు లేదా హైకోర్టు తప్పు పడితే లోక్ సభ మరింత గట్టిగా నిలబడే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే లోక్ సభలో మోడీకి కావాల్సిన దానికంటే ఎక్కువే బలం ఉంది.
తిరిగి దక్కుతుందా?
ఇక సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై గుజరాత్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు స్టే విధిస్తే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం తిరిగి దక్కుతుందా? ఇలాంటి సందర్భాల్లో.. కింది కోర్టు తీర్పు మీద పై కోర్టులు స్టే విధించినా, అంతిమ నిర్ణయం లోక్‌సభ సచివాలయానిదేనని ఎన్సీపీ పార్టీకి చెందిన లక్ష్వదీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఉదంతం స్పష్టం చేస్తోంది. 2009 ఎన్నికల్లో జరిగిన హింసకు సంబంధించి మహమ్మద్ ఫైజల్‌పై నమోదైన కేసును విచారించిన కింది కోర్టు ఈ ఏడాది జనవరి 11న ఆయనను దోషిగా తేల్చి 10 ఏళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, జనవరి 13న ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ జనవరి 25న ఆయన కేరళ హైకోర్టును ఆశ్రయించగా.. స్టే లభించింది. అయినప్పటికీ లక్షద్వీప్ నియోజకవర్గం ఖాళీ అయినట్టు అప్పటికే ప్రకటించిన ఎన్నికల సంఘం.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తనకు శిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పుపై కేరళ హైకోర్టు స్టే విధించినా ఎన్నికలు నిర్వహించడమేంటని ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికను రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు
ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని కేంద్ర న్యాయ శాఖ కూడా సిఫారసు చేసింది. అయినా కూడా ఈ కేసులో ఇప్పటికీ లోక్‌సభ స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు స్టే విధించినా తనపై అనర్హత వేటు విధిస్తూ జారీ చేసిన నోటిఫికేషనను రద్దు చేయకుండా స్పీకర్ కార్యాలయం ఫైలును పెండింగ్‌లో పెట్టిందని ఫైజల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను రోజూ పార్లమెంటుకు వస్తున్నానని, కానీ సభలోకి మాత్రం అనుమతించడం లేదని తెలిపారు. అలాగే.. యూపీలో అనర్హత వేటుకు గురైన ఎస్పీ ఎమ్మెల్యే ఆజంఖాన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర సర్కారును ‘ఎందుకంత తొందర’ అంటూ నిలదీసింది. ఆయనకు కనీసం ఊపిరి పీల్చుకునే సమయాన్నైనా ఇచ్చి ఉండాల్సింది అంటూ వ్యాఖ్యానించింది.
రాహుల్ గాంధీ వ్యవహారాన్ని వాడుకుంటాడు
ఇక సుప్రీం వైఖరిపై ఆగ్రహంగా ఉన్న మోడీ.. న్యాయ వ్యవస్థ పరిధిని గుర్తు చేసేందుకు రాహుల్ గాంధీ వ్యవహారాన్ని వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం విషయంలో సుప్రీంకోర్టు ఎక్కువ జోక్యం చేసుకుంది అనేది మోడీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ.. ఇక కోర్టులు చెబితే స్పీకర్ ఆఫీసు వింటుందా? మా విచక్షణ పరిధిలోకి రావొద్దు అని మొండిగా వ్యవహరిస్తుందా అనేది వేరే చర్చ.. ప్రస్తుతం మూడు లోక్ సభ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా స్పీకర్ ఆఫీస్ స్పందించినంత వేగంగా వయనాడు సీటును కూడా ఖాళీగా ప్రకటించి.. మూడు సీట్లకూ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే.. కథ మరింత రక్తి కడుతుంది. దాన్ని ఒకవేళ సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తే.. అప్పుడు ఎన్నికల సంఘం వర్సెస్ సుప్రీంకోర్టు, లోక్ సభ స్పీకర్ ఆఫీస్ వర్సెస్ సుప్రీంకోర్టు అన్నట్టుగా సాగుతూ ఉంటుంది.
ఈ దుర్గతి పట్టేది కాదు
ఇక ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే.. అనర్హత వేటు వేయడం తప్పు అనలేదు.. ఒకవేళ తప్పు అని గనుక అంటే.. నేను ఉన్న చట్టాన్ని అమలు చేశానని స్పీకర్ ఆఫీస్ చెబుతుంది. గతంలో ఇదే రాహుల్ గాంధీ చింపేసిన ఆర్డినెన్స్ చట్టంగా మారి ఉంటే రాహుల్ గాంధీకి ఇప్పుడు ఈ దుర్గతి పట్టేది కాదు. ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చాలని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు చెబితే.. మోడీ పాటిస్తాడా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాహుల్ గాంధీ పై, సోనియా గాంధీ పై, కాంగ్రెస్ ముఖ్య నేతలపై ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసు వేలాడుతోంది. రాబర్ట్ వాద్రా మీద కేసులు పెండింగ్లో ఉన్నాయి.. ఒకవేళ సూరత్ కోర్టు తీర్పు పై సుప్రీంకోర్టులో ఊరట లభిస్తే.. మిగతా వాటిని రాహుల్ గాంధీ పై మోడీ ప్రయోగిస్తాడు. అతని అంతిమ లక్ష్యం కాంగ్రెస్ ముఖ్త్ భారత్.. ఆ దిశ గానే అడుగులు వేస్తున్నాడు.