NBK 108: బాలయ్యకు మంచి రోజులొచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి వెంటాడిన ప్లాప్స్ కి చెక్ పెట్టి ఆయన వరుస హిట్స్ కొడుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక హిట్ ఇస్తే నాలుగైదు ప్లాప్ పడేవి. అఖండ తో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య వీరసింహారెడ్డితో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ నమోదు చేశారు. ఇది బాలయ్య అభిమానులకు ఎక్కడలేని సంతోషం పంచుతుంది. వీరసింహారెడ్డి సక్సెస్ నేపథ్యంలో జనవరి 22న హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ హాల్ నందు విజయోత్సవ వేడుక నిర్వహించారు.

ఈ సక్సెస్ మీట్ కి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలయ్య లేటెస్ట్ మూవీ 108 చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి సైతం పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలయ్యను పొగిడే క్రమంలో ఆయన 108 మూవీకి సంబంధించిన కీలక విషయం లీక్ చేశారు. వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య రాయలసీమలో వీరవిహారం చేశారు. కానీ నా మూవీలో ఆయన తెలంగాణాలో దిగుతున్నారు. వీరవిహారం చేయనున్నారు.. అన్నారు.
NBK 108 చిత్ర నేపథ్యం తెలంగాణా సాగుతుందని అనిల్ రావిపూడి చెప్పకనే చెప్పారు. అనిల్ రావిపూడి మాస్ ఎలివేషన్స్ తో పాటు హిలేరియస్ కామెడీకి పెట్టింది పేరు. మరి బాలయ్యతో ఆయన కామెడీ ఎపిసోడ్స్ కూడా ట్రై చేస్తారేమో చూడాలి. అనిల్ రావిపూడి మాటలు పరిశీలిస్తే… బాలయ్య తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ కొడతారేమో చూడాలి. తెలంగాణా యాసలో బాలయ్య తన మార్కు పవర్ ఫుల్ డైలాగ్స్ చెబితే నిజంగా సరికొత్తగా ఉంటుంది. ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తి చేసినట్లు అనిల్ రావిపూడి ఈ సందర్భంగా వెల్లడించారు.

అనిల్ రావిపూడి విశ్వాసం చూస్తుంటే బాలయ్యకు హ్యాట్రిక్ హిట్స్ ఖాయమనిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డి రన్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. అయితే వాల్తేరు వీరయ్యతో పోల్చితే చాలా వెనుకబడ్డారు. అమెరికాలో వీరసింహారెడ్డి వన్ మిలియన్ వసూళ్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దర్శకుడు గోపీచంద్ మలినేని వీరసింహారెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారు. శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు. బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్ చేశారు.