
Balagam Mogilaiah Health: బలగం మొగిలయ్య పరిస్థితి మరింత విషమించింది. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని ఆయన భార్య వేడుకుంటున్నారు. ఈ మేరకు ఆవేదన చెందుతూ ఓ వీడియో విడుదల చేశారు. మొగిలయ్య కిడ్నీ వ్యాధి బాధితుడు. చాలా కాలంగా ఆయన ఈ సమస్యతో బాధపడుతున్నారు. మొగిలయ్యకు డయాలసిస్ అవసరం. వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయాలి. ఇటీవల ఆయన పరిస్థితి ఇంకా దిగజారింది. డయాలసిస్ కి కూడా స్పందించని స్థితికి చేరారు.
రెండు రోజుల క్రితం మొగిలయ్యకు డయాలసిస్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరుగుతుంది. ఖరీదైన వైద్యం భరించే స్థోమత లేని తమను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె వేడుకుంటున్నారు. బెడ్ పై చలనం లేకుండా దీనస్థితిలో ఉన్న మొగిలయ్య పక్కన నిల్చొని భార్య వేడుకున్నారు.
దయచేసి నా భర్తను కాపాడండి. మెరుగైన వైద్యం అందించండి… అంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఖరీదైన చికిత్స అందితే మినహా మొగిలయ్యను కాపాడుకోవడం కష్టం. గతంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు మొగిలయ్య చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ దిశగా చర్యలు జరిగిన సూచనలు లేవు. మొగిలయ్య ఆరోగ్యం కోసం కుటుంబ సభ్యులు రూ. 14 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు. రూ. 6 లక్షలు అప్పులు అయ్యాయని అన్నారు.

బలగం దర్శకుడు వేణు కొంత మొత్తం ఆర్థిక సహాయం చేశారు. సమస్య పెద్దది కావడంతో లక్షల్లో ఖర్చు అవుతుంది. అంతరించి పోతున్న బుడగజంగాలకు చెందిన మొగిలయ్య దంపతులు ఇదే వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి క్లైమాక్స్ సన్నివేశం కోసం మొగిలయ్య దంపతులతో ఒక పాట పాడించారు. ఆ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఆ విధంగా మొగిలయ్య దంపతుల కళ వెలుగులోకి వచ్చింది.