
Balagam Climax Song Singers: బలగం సినిమా మొత్తం ఒకెత్తు క్లైమాక్స్ లో వచ్చే ‘తోడుగా మా తోడుండి’ సాంగ్ మరొక ఒకెత్తు. కొమురయ్య ఆత్మగా బుడగ జంగాలు పాడే పాట ప్రేక్షుకుల చేత కన్నీరు పెట్టిస్తుంది. పిల్లల మీద చనిపోయిన తండ్రి ప్రేమను చెబుతూ, మనస్పర్థలు తొలగిస్తూ అందరినీ ఒకటి చేసే ఆ పాట సినిమాకు ప్రధాన ఆకర్షణ. పతాక సన్నివేశాన్ని గొప్పగా పండించింది. ఈ సాంగ్ పాడిన మొగిలయ్య, కొమురమ్మ నిజ జీవితంలో చేసేది అదే. సహజంగా ఉండటం కోసం వేణు బుర్రకథలు చెప్పే బుడగ జంగాల వారైన మొగిలియ్య, కొమురమ్మలతో పాట పాడించారు.
తమ గానంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మొగిలియ్య దంపతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొగిలియ్య కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. కోవిడ్ సోకి రెండు కిడ్నీలు పాడయ్యాయి. రోజు మార్చి రోజు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. ఇటీవల ఆరోగ్యం విషమించి కంటి చూపు కూడా పోయిందట. ప్రస్తుతం ఆయన మంచానికే పరిమితం అయ్యారు.
ప్రతి నెలా వైద్యానికి రూ. 20 వేలు ఖర్చు అవుతున్నాయట. డయాలసిస్ మాత్రం ఆరోగ్యశ్రీ మీద చేస్తున్నారట. ఇప్పటికే రూ. 14 లక్షలు మొగిలియ్య వైద్యానికి ఖర్చు చేశారట. రూ. 6 లక్షల అప్పు ఉందట. ఆయన కంటి చూపు రావాలన్నా, తిరిగి కోలుకోవాలన్నా రూ.8.5 లక్షల వరకు ఖర్చు అవుతుందట. ఇటీవల బలగం డైరెక్టర్ వేణు ఎల్దండి కొంత డబ్బు సహాయం చేశారట. అవి సరిపోలేదంటూ ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం మొగిలియ్యకు వైద్యం అందించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. మొగిలయ్య చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలైన మొగిలియ్య లాంటి కళాకారుల అవసరం ఎంతైనా ఉంది. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని పలువురి భావన.
బలగం చిత్రానికి వేణు ఎల్దండి దర్శకుడిగా ఉన్నారు. దిల్ రాజు నిర్మించారు. బలగం మూవీలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు చేశారు. వరల్డ్ వైడ్ బలగం రూ. 22 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఆకట్టుకుంది. ప్రైమ్ లో బలగం స్ట్రీమ్ అవుతుంది.