Bahubali Samosa: ఆ మధ్య బాహుబలి సినిమా వచ్చినప్పుడు.. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు “నాయుడుగారి కుండ బిర్యాని” అనే ఓ హోటల్ బాహుబలి థాలిని పరిచయం చేసింది. అందులో ఉన్న ఫుడ్ మొత్తం తింటే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆ హోటల్ కు ఎక్కడా లేని పేరు వచ్చింది. ఫలితంగా ఆ హోటల్ నిర్వాహకులు ఏకంగా మూడు బ్రాంచ్ లు ప్రారంభించారు. బాహుబలి సినిమా వచ్చి ఆరు సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంకా ఆ థాలి కొనసాగుతూనే ఉంది.. ఈ హోటల్ నెలకొల్పిన విధానాన్ని మరికొన్ని హోటల్స్ ప్రవేశపెట్టాయి.. తాజాగా హైదరాబాద్ శివారులోని కొండాపూర్ లోని హోటల్ “అన్ స్టాపబుల్” పేరుతో ఒక భారీ థాలీని ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. ఇక మన దగ్గర అంటే చాలామంది బిర్యాని లేదా మాంసాహారం ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి.. థాలీ లో వాటికే ప్రథమ ప్రాధాన్యమిస్తారు. నార్త్ ఇండియాలో అలా కాదు.. అక్కడ సమోసా, కచోరీ, పావ్ బాజీ, రోటీ ఎక్కువగా తింటారు.. అలా వారు తినే వాటిలోనే ఒక బాహుబలి సమోసాను తయారు చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా సమోసా తినే పోటీ పెట్టారు.
ఏకంగా 12 కిలోలు
మనం తినే సమోసా సమోసా వంద లేదా 150 గ్రాములు ఉంటుంది. నార్త్ ఇండియాలో ప్రత్యేకంగా తయారు చేసిన సమోసా మాత్రం కిలోల కొద్దీ బరువు ఉంది. అందుకే దీనికి బాహుబలి సమోసా అనే పేరు పెట్టారు. దీని బరువు ఏకంగా 12 కిలోలు. దీన్ని తిన్నవారికి కూడా భారీ రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఈ భారీ సమోసాను ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందిన కౌశల్ స్వీట్స్ అండ్ బేకరీ వాళ్లు తయారు చేశారు. అంతేకాదు తమ బేకరిని భారీగా ప్రమోట్ చేసుకునేందుకు సమోసా పోటీపెట్టారు..
30 నిమిషాల్లో తింటే 71,0000
12 కిలోల బరువు ఉన్న ఈ సమోసాను 30 నిమిషాల్లో తిన్నవారికి 71,000 రివార్డు ప్రకటించారు.. ఇక ఈ సమోసాను సుమారు 6 గంటలపాటు నూనెలో వేయించారు. అనంతరం 7 కిలోల పేస్ట్రీ కోన్ లో ప్యాక్ చేశారు. దీనికి రుచికరమైన బీట్స్ యాడ్ చేశారు..ముగ్గురు నలభీముల్లాంటి వ్యక్తులు దీన్ని 90 నిమిషాల్లో తయారు చేశారు. యూ ట్యూబర్లు, బ్లాగర్లు ఈ బాహుబలి సమోసా గురించి వీడియోలు రూపొందించారు. దీంతో ఈ బాహుబలి సమోసా తెగ వైరల్ అవుతోంది. దీని గురించి తెలుసుకున్న కొంతమంది పుట్టినరోజు వేడుకల్లో కేకు లకు బదులు సమోసా ఆర్డర్ చేస్తున్నారు.. ఇప్పటికే ఈ తరహా సమోసాలకు 50 ఆర్డర్లు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక సమోసా ఎంత రుచిగా ఉన్నప్పటికీ 12 కిలోలు తినడం అసాధ్యమని దీనిని కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు చెబుతున్నారు. అందుకే బేకరీ నిర్వాహకులు ఈ సమోసా పోటీ పెట్టారు. మరి దీన్ని తినే ఆ తిండి పోతు ఎవరో చూడాలి.