Rashmika Mandanna: ఏదైనా నడిచినంత కాలమే… ఒకసారి ప్లేటు తిరగబడితే కోలుకోవడం కష్టం. లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో గత మూడేళ్ళుగా రష్మిక పరిశ్రమను ఊపేస్తోంది. అయితే ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. అదే సమయంలో సౌత్ లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఒకరిద్దరు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ పోస్ట్ ఖాళీగా ఉన్న రష్మిక పేరు తెరపైకి తేవడం లేదు. కన్నడ పరిశ్రమ ఆమెను బ్యాన్ చేయనుందనే ఊహాగానాలు కూడా దీనికి కారణం కావచ్చు.

ఇప్పుడు సినిమా అంటే పాన్ ఇండియా మూవీనే. టైర్ టూ హీరోలు కూడా అసలు తగ్గడం లేదు. మరి వందల కోట్లతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాలు పలు భాషల్లో విడుదల చేయకుండా ఉంటారా? చెప్పండి. అలాంటప్పుడు రష్మిక హీరోయిన్ గా ఉంటే కర్ణాటకలో సమస్య రావచ్చు. పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ పక్కనపెట్టినా… టాలీవుడ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత అతిపెద్ద మార్కెట్ కర్ణాటక. అక్కడ నిషేధం గట్రా సమస్యలు వస్తే పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది.
రిస్క్ ఎందుకులే అని రష్మిక జోలికి మేకర్స్ వెళ్లడం లేదని తెలుస్తుంది. కాగా సౌత్ లో స్టార్ డమ్ రాగానే రష్మిక బాలీవుడ్ కి వలస వెళ్లారు. అందరూ సౌత్ జపం చేస్తుంటే ఏదో పొడిచేద్ధామని అక్కడకు పోయింది. బాలీవుడ్ ఆఫర్స్ కోసం సౌత్ చిత్రాలు వదులుకున్నారని సమాచారం. తీరా అక్కడ ఆమె నిలదొక్కుకునే పరిస్థితి కనపడటం లేదు. రష్మిక ఫస్ట్ బాలీవుడ్ మూవీ గుడ్ బై అట్టర్ ప్లాప్. అమితాబ్ నటించినా ఆ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు.

దీంతో మిషన్ మజ్ను పై భారీ ఆశలు పెట్టుకుంది. ఫార్మ్ లో యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరో కావడంతో కెరీర్ కి మూవీ బూస్ట్ ఇస్తుందని భావించింది. తీరా ఆ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన మూవీకి ఎలాంటి టాక్ వచ్చినా ఆర్టిస్ట్స్ కి అదనంగా వచ్చే ఫేమ్ ఏమీ ఉండదు. ఇక రష్మిక చేతిలో ఉన్న మరో ప్రాజెక్ట్ యానిమల్. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. అయితే విడుదలకు చాలా సమయం ఉంది. మొత్తంగా అటు సౌత్ ఇటు నార్త్ రెండు చోట్లా రష్మికకు బ్యాడ్ టైం నడుస్తుంది.