Attack on ABN, HMTV : వివేకా హత్యకేసు విచారణలో వరుసగా రెండోసారి అవినాష్ రెడ్డి ముఖం చాటేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. దీంతో అనుచరులతో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే తల్లి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ నుంచి తిరిగి పులివెందుల వచ్చేశారు. సీబీఐకి సమాచారమిచ్చి వెనుదిరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అనుచరులు అతిగా ప్రవర్తించారు. ఏకంగా మీడియా ప్రతినిధులపైనే దాడిచేశారు. అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్నారన్న కారణంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటీవీ వాహనాలపై దాడిచేశారు. ఓ కారు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఓ రిపోర్టర్ చేతిలో ఉన్న కెమెరాను సైతం లాక్కున్నారు. ఈ వీడియోలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అయితే ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులు ఖండిస్తున్నారు. తెలంగాణ జనసేన విభాగం ఘటనపై స్పందించింది. తెలంగాణ ఇన్ చార్జి శంకర్ గౌడ్ ట్విట్టర్ లో స్పందించారు. హైదరాబాద్ నడిబొడ్డున మీడియాపై దాడి జరగడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఈ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
ఈ వ్యవహారంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. జరిగిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆమె.. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.