Banjarahills Private School: చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని చిన్నారులపై అత్యాచారానికి ఒడిగట్టడంతో సభ్య సమాజం తల దించుకుంటోంది. నాన్న వయసులో ఉన్న నిందితుడు అభం శుభం తెలియని చిన్నారిపై లైంగిక వేధింపులకు గురి చేయడం ఆందోళన కలిగిస్తోంది. రెండు నెలలుగా అతడు ఈ తతంగానికి పూనుకోవడం చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవరే ఈ ఘాతుకానికి పాల్పడటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని చితకబాదారు. డ్రైవర్ తీరుపై ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. నాలుగేళ్ల బాలికను లక్ష్యంగా చేసకుని అతడు దాడి చేయడం అందరిలో కోపం పెంచింది.

దిశ లాంటి చట్టాలున్నా ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. చిన్నారిపై లైంగిక దాడి చేస్తున్నా సరిగా చెప్పలేని స్థితిలో బాలిక ఉంది. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. పశువులా అతడు బాలికపై పడి కోరికలు తీర్చుకోవడం హేయమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. డిజిటల్ రూంలోకి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యం చేస్తున్నాడు. డ్రైవర్ నిర్వాకంతో బాలిక నీరసంగా ఉండి ఏడ్వడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. విషయం కాస్త వెలుగు చూడటంతో స్థానికులు పాఠశాల డ్రైవర్ రజినీ కుమార్ ను పోలీసులకు అప్పగించారు.
వైజాగ్ లో తొమ్మిదేళ్ల బాలికపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయడంతో అతడికి పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బాధితురాలికి రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే మరో ఘటనలో మూడో తరగతి చదువుతున్న విద్యార్థినిని మొబైల్ గేమ్ లతో ఆకర్షించి ఆమెకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగిక దాడి చేయడంతో అతడిపై కేసు నమోదైంది. నిందితుడు కోలాటి బాలయోగిపై 376, 354(ఎ), 506, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయడంతో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ పోక్సో న్యాయమూర్తి రామశ్రీనివాస్ మంగళవారం తీర్పు చెప్పడం గమనార్హం.

మహిళల కోసం ఎన్ని చట్టాలున్నా ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వయసు తారతమ్యాలు లేకుండా చిన్న పిల్లలపై కూడా దారుణాలకు తెగబడటం ఆవేదన కలిగిస్తోంది. లోకం పోకడ తెలియని వారిని పావులుగా చేసుకుని రెచ్చిపోతున్న వారిని కట్టడి చేసేందుకు చట్టాలు వచ్చినా మనుషుల్లో ప్రవర్తన మారడం లేదు. మనిషిలో కూడా రాక్షసుడు ఉన్నాడని తెలియజేసే లక్షణాలే ఇవి. ముద్దులొలికే పసిపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్నారంటే వారిలో ఎంతటి విషం ఉందో అర్థమవుతోంది. నాగరికత మారుతున్న మనిషిలో నడవడిక మాత్రం మారడం లేదు. ఫలితంగా ఎన్నో దురాగాతాలు చోటుచేసుకుంటున్నాయని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై ప్రభుత్వం నిర్భయ, దిశ చట్టాలు ఉపయోగించి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్ష పడేలా చూడాలని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలను సీజ్ చేసి పిల్లల భవిష్యత్ ను కాపాడాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.