
Attack On TDP Office: ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో పరిస్థితి అదుపు తప్పుతోంది. రాజకీయ దాడులు, ప్రతిదాడులతో జిల్లా అట్టుడుకుపోతోంది. రాష్ట్రంలో ఎటువంటి పరిణామం చోటుచేసుకున్నా కృష్ణా రాజకీయాలు వేడెక్కడం పరిపాటిగా మారింది.. తాజాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వివాదానికి కారణమైంది. రౌడీషీటర్లుగా భావిస్తున్న కొంతమంది కార్యాలయంపై దాడులు చేశారు. ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా టీడీపీ నేతల వాహనాలపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. కత్తులతో తిరిగి హల్ చల్ చేశారు. కానీ పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. అసలు కేసులే నమోదుచేయలేదు. తిరిగి బాధితులుగా ఉన్న టీడీపీ నేతలపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా నలుమూలల నుంచి బయలుదేరిన టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తనను పిల్ల సైకో అన్నందునే అనుచరులు దాడిచేశారని.. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నట్టు ఒప్పుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ బాధితులుగా ఉన్న టీడీపీ నేతలు అదుపులోకి తీసుకోవడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. దీనిపై నిరసన తెలపడానికి గన్నవరం బయలుదేరారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని నేతలను అరెస్ట్ చేస్తున్నారు. ముందుగా టీడీపీ నేత పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదు. అనంతరం మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను అదుపులోకి తీసుకున్నారు. నెట్టెం రఘురాం, తంగిరాల సౌమ్య, బొండా ఉమా, బుద్దా వెంకన్న తదితర నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను అరెస్ట్ చేసి నాగాయలంక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యాలయంపై దాడులు, విధ్వంసాలకు దిగడంపై టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంత చేసినా ఎమ్మెల్యే వంశీపైన కానీ.. ఆయన అనుచరులపై కేసు నమోదుచేయకపోవండాన్ని ఆక్షేపిస్తున్నాయి. పైగా తిరిగి టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడాన్ని మండిపడుతున్నాయి. టీడీపీ నేత పట్టాభిని ఎక్కడకి తీసుకెళ్లారో తెలియడం లేదు. ఆయన ఫోన్ సైతం స్విచ్ఛాప్ వస్తోంది. ఆయనకు ఏదైనా జరగరానిది జరిగితే అందుకు సీఎం జగన్,.డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన భార్య చందన హెచ్చరించారు. గన్నవరం ఇష్యూపై టీడీపీ హైకమాండ్ డీజీపీకి లేఖ రాసింది. టీడీపీ కార్యాలయంపై దాడిచేసిన వారిని తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ.. న్యాయం చేయకుంటే ఉద్యమిస్తామని స్పష్టమైన హెచ్చరికలు పంపింది.