
Atharva Teaser Review: ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్స్ మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2 సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఉత్కంఠ రేపే ట్విస్ట్స్ తో సాగే క్రైమ్ థ్రిల్లర్స్ ని ఓ వర్గం ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. అయితే ఊహించని స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని కట్టిపడేయాలి. ఏమాత్రం పట్టు సడలినా సినిమా డామేజ్ అవుతుంది. క్రైమ్ జోనర్లో తెరకెక్కిన మరొక థ్రిల్లర్ అథర్వ. కార్తీక్ రాజు హీరోగా దర్శకుడు మహేష్ రెడ్డి తెరకెక్కించారు.
అథర్వ చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా ప్రమోషన్స్ షురూ చేశారు. మార్చి 20న అథర్వ టీజర్ విడుదలైంది. నిమిషానికి పైగా ఉన్న టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. అన్ని క్రైమ్ థ్రిల్లర్స్ మాదిరి అథర్వ చిత్ర కథ కూడా సేమ్. ఒక మర్డర్ జరుగుతుంది. దాని వెనుక ఎవరున్నారనే అన్వేషణగా సినిమా నడుస్తుంది. హీరోగా నటించిన కార్తీక్ రాజు క్లూస్ టీం డిపార్ట్మెంట్ లో పనిచేసే అధికారిగా కనిపిస్తున్నారు.
ఇక కేసును నిగ్గు తేల్చచడంలో, హంతకుడిని ఛేదించడంలో క్లూస్ టీం ఎంతగానో దోహదం చేస్తుంది. క్రైమ్ సీన్లో క్రిమినల్ వదిలెళ్లిన ఆధారాలు సేకరించేది క్లూస్ టీం. మరి అలాంటి కీలక డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న కార్తీక్ రాజ్ హంతకుడిని పట్టుకున్నాడు? ఇంతకీ ఆ హంతకుడు ఎవరు? ఎందుకు మర్డర్ చేశాడు? ఈ ప్రశ్నల సమాహారమే అథర్వ మూవీ. హీరో కార్తీక్ రాజ్ పాత్రకు చక్కగా సరిపోయారు. ఆయన ఆహార్యం బాగుంది.

ఇన్వెస్టిగేషన్ డ్రామాతో పాటు యాక్షన్, సస్పెన్సు అంశాలు జోడించి తెరకెక్కించారు. దర్శకుడు మహేష్ రెడ్డి టీజర్ తో ఆకట్టుకున్నారు. ఇక అథర్వ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఏంటనేది సస్పెన్స్. మ్యూజిక్ శ్రీచరణ్ పాకల అందిస్తున్నారు. టీజర్ కి ఆయన ఇచ్చిన బీజీఎం బాగుంది. పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సుహాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
