Poorna Pregnancy: హీరోయిన్ పూర్ణ తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియా వేదిక గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. దీంతో పూర్ణకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. పెళ్ళైన ఆరు నెలల్లోనే పూర్ణ ప్రెగ్నెన్సీ ప్రకటించడం విశేషంగా మారింది. 2022 ప్రారంభంలో పూర్ణ పెళ్లి ప్రకటన చేశారు. దుబాయ్ లో వ్యాపారవేత్తగా ఉన్న షానిద్ అసిఫ్ అలీతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. నెలలు గడుస్తున్నా పెళ్లి వార్త చెప్పకపోవడంతో బ్రేకప్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి.

అయితే మాకు పెళ్లి కూడా జరిగిపోయిందని పూర్ణ సడన్ షాక్ ఇచ్చింది. జూన్ 12న దుబాయ్ లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహమైంది. కొన్ని పరిస్థితుల కారణంగా నిరాడంబరంగా వేడుక పూర్తి చేశాము. కేరళలో ఉన్న బంధువులు, మిత్రుల కోసం ఇండియాలో వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని పూర్ణ వివరణ ఇచ్చారు. ఈ విషయం చెప్పి చాలా కాలం అవుతుంది. పూర్ణ ఎలాంటి మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేయలేదు. ఇంతలోనే తల్లిని అయ్యానంటూ ప్రకటించి మరోసారి షాక్ ఇచ్చారు.
త్వరలో నేను తల్లిని కాబోతున్నాను అని పూర్ణ ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశారు. ఎక్కువగా ఇండియాలోనే ఉంటున్న పూర్ణ తక్కువ సమయంలోనే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. వివాహం జరిగినప్పటికీ పూర్ణ నటిగా, టెలివిజన్ ప్రెజెంటర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం పూర్ణ నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల చిత్రాలు చేస్తున్నారు. నాని-కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న దసరా మూవీలో పూర్ణ కీలక రోల్ చేస్తున్నారు.

దసరా పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. ఇటీవల పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం విడుదలైంది. ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. చాలా కాలంగా పూర్ణ బుల్లితెరపై సందడి చేస్తున్నారు. డాన్స్ రియాలిటీ షో ఢీ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటారు. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా మంచి విజయాలు సాధించిన పూర్ణ… నిలదొక్కుకోలేకపోయారు. సీమటపాకాయ్, అవును వంటి చిత్ర చిత్రాల్లో పూర్ణ హీరోయిన్ గా నటించారు.