Anant Ambani Pre Wedding: వెనుకటి రోజుల్లో మహారాజులు తమ ఇంట్లో పెళ్లిళ్ళను ఆకాశమంత పందిరి..భూ దేవంతా పీట వేసి జరిపే వారట.. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఇప్పటి స్మార్ట్ ఫోన్ యుగంలో మాత్రం అపర కుబేరుడు, ఇండియాలోనే అతిపెద్ద ధనవంతుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తన చిన్న కొడుకు అనంత్ అంబానీ (Anant Ambani), కాబోయే కోడలు రాధికా మర్చంట్ (Radhika merchant) ముందస్తు పెళ్లి వేడుకలు మాత్రం అంబరాన్ని తాకేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఈ ముందస్తు పెళ్లి వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గుజరాత్ లోని జామ్ నగర్ పరిసర ప్రాంతాల్లో కనివిని ఎరుగని స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథుల కోసం ప్రత్యేకమైన విమానాలు ఏర్పాటు చేశారు. జామ్ నగర్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో అక్కడ ఆల్ట్రా లగ్జరీ టెంట్స్ ఏర్పాటు చేశారు. అందులో సకల సౌకర్యాలు కల్పించారు. అయితే ఈ ముందస్తు పెళ్లి వేడుకలకు సంబంధించి వచ్చే వారి కోసం ఏకంగా 2,500 రకాల వంటకాలను వడ్డించనున్నట్టు తెలుస్తోంది.
జామ్ నగర్ లో మార్చి ఒకటి నుంచి మూడో తేదీ వరకు ఈ ముందస్తు పెళ్లి వేడుకలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 1000 మందికి పైగా అత్యంత ప్రముఖులు ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఈ వేడుకలకు వచ్చే ప్రముఖుల కోసం వడ్డించిన వంటకం మరొకసారి వడ్డించకుండా పసందైన విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.ఈ వంటకాలను వండేందుకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నుంచి ప్రత్యేకంగా 21 మంది ప్రధాన పాకశాస్త్ర నిపుణులు జామ్ నగర్ వచ్చేశారు. వారి సహాయకులు కలిపి సుమారు 200 మంది దాకా ఉంటారు. భారతీయ వంటకాలతో పాటు జపనీస్, మెక్సికన్, థాయ్, పార్సీ వంటకాలను అతిధులకు రుచి చూపించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ లో 75 వెరైటీలు, లంచ్ లో 225, డిన్నర్ లో 275 రకాల వంటకాలను వడ్డిస్తారు. ఇవి మాత్రమే కాదు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు 85 రకాల వంటకాలను సిద్ధం చేశారు. ఇందులో అతిథులు ఏది కోరుకుంటే అది అందించాలని ముఖేష్ అంబానీ ఆదేశించడంతో చెఫ్ లు ఆ విధంగా ప్లాన్ రూపొందించుకున్నారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ గత ఏడాది జనవరి 19న ముంబైలో నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. జూలైలో వీరికి వివాహం జరగనుంది. మార్చి ఒకటి నుంచి మూడు వరకు ముందస్తు వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే జామ్ నగర్ ను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రత్యేకంగా రోడ్లు వేశారు. పలు దేవాలయాలను ఆధునికరించారు.. అంతేకాదు అతిథులు బస చేసేందుకు ప్రత్యేకంగా ఆల్ట్రా లగ్జరీ టెంట్లు ఏర్పాటు చేశారు. అతిథుల కోసం ముకేశ్ అంబానీ నీతా అంబానీ దంపతులు ప్రత్యేకంగా బహుమతులు కూడా ఇవ్వనున్నారు. అయితే ఈ బహుమతులు ఏంటనేది ఇంతవరకు బయటికి పొక్క లేదు. పలువురు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో భద్రత దళాలు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నాయి. కాబోయే కోడలు రాధికా మర్చంట్ కు ముకేశ్ అంబానీ దంపతులు ఇదివరకే నాలుగు కోట్ల విలువైన విలాసవంతమైన బెంట్లీ కారును బహుమతిగా అందజేశారు. కొన్ని బంగారు నగలు కూడా ఆమెకు కానుకగా ఇచ్చారు.