https://oktelugu.com/

Anand Mahindra: సంపాదనకు వయసుతో సంబంధం లేదు.. ఆనంద్ మహీంద్రా మండే మోటివేషన్ అదిరింది..

రాజేష్ రావాని.. అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చిన్న వయసులోనే ట్రక్ డ్రైవర్ గా మారాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 8, 2024 / 06:51 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra: వయసున్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఈ సాంకేతిక యుగంలో ఆ సామెత అస్సలు కుదరదు. ఎందుకంటే అరచేతిలో ప్రపంచం ఎండిపోతున్న ఈ కాలంలో.. ఎవరి జీవితం ఎప్పుడు టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేరు. సాంకేతికత అనేది మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేటి కాలంలో..ఫలానా పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది ఉట్టి మాటే అవుతున్నది. ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో ఓ ట్రక్ డ్రైవర్ కు దాదాపుగా 60కి మించి సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు తెలిసిందల్లా ట్రక్ డ్రైవింగ్ చేయడం.. మధ్య మధ్యలో ట్రక్ ఆపి వంట చేసుకోవడం.. ఖాళీగా ఉంటే తన ఫోన్లో యూట్యూబ్ వీడియోలు చూడడం.. అంతే అంతకుమించి ఆయనకు ఏమీ తెలియదు. కానీ ఆయన ఇప్పుడు ఒక సెలబ్రిటీ.. అంతేకాదు యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించి ఏకంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఆ ట్రక్ డ్రైవర్ కు సంబంధించిన విజయ గాధను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ఎక్స్ లో ప్రస్తావించారు.

    25 సంవత్సరాలుగా ట్రక్ డ్రైవర్ గా..

    రాజేష్ రావాని.. అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో చిన్న వయసులోనే ట్రక్ డ్రైవర్ గా మారాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.. ట్రక్ డ్రైవర్ గా ఆయన చాలా ప్రాంతాలకు వెళ్తారు. బయట ఆహారం తినడం ఆయనకు ఇష్టం ఉండదు. ట్రక్ తో పాటే వంట చేయడానికి అవసరమైన వస్తువులను, ఇతర పాత్రలను తీసుకెళ్తారు. ప్రయాణం మధ్యలో ఆగినప్పుడు వంట చేసుకుంటారు. తయారు చేసుకున్న ఆహారాన్ని తిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తర్వాత మళ్లీ తన గమ్యస్థానానికి బయలుదేరుతారు. స్మార్ట్ ఫోన్ అనేది చేతిలోకి వచ్చిన తర్వాత రాజేష్ యూట్యూబ్ వీడియోలు చూడడం అలవాటుగా చేసుకున్నాడు. అలా కుకింగ్ వీడియోలు చూసి.. సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. అందులో పెద్ద ఆడంబరాలు లాంటివి ఏమీ ఉండవు. పెద్ద పెద్ద సెలబ్రిటీల లాగా హంగూఆర్భాటం కనిపించదు.

    వంట వండిన వీడియోలతో..

    తను దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు.. మధ్యలో ఆగినప్పుడు తయారు చేసుకునే వంటలను వీడియో తీస్తాడు. ఈ వీడియో కూడా తనతో పాటు వచ్చే కో డ్రైవర్ లేదా క్లీనర్ తీస్తాడు. ఆ తర్వాత దానిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాడు. ఎడిటింగ్ గట్రా ఏమీ ఉండవు. అలా ఆయన వంట చేస్తున్న తీరు చాలామందికి నచ్చింది. అలా అలా రాజేష్ ఛానల్ కు సబ్స్క్రైబర్లు పెరిగిపోయారు. ప్రస్తుతం ఆయన ఛానల్ కు 1.5 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో రాజేష్ ఒక ఇల్లు నిర్మించుకున్నాడు. ఆర్థికంగా స్థిరపడ్డాడు. రాజేష్ కుకింగ్ ఛానల్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కు చాలా నచ్చింది. తన మండే మోటివేషన్ లో భాగంగా రాజేష్ గురించి ఆనంద్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో ప్రముఖంగా ప్రస్తావించారు. “రాజేష్ రావాని అనే వ్యక్తి గత 25 సంవత్సరాలుగా ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఆయన తన ఆయన తన వృత్తిని కొనసాగిస్తూనే.. తను వండుకునే వంటలకు సంబంధించి వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. 1.5 మిలియన్ సబ్స్క్రైబర్లతో సెలబ్రిటీగా మారారు. ఆ సంపాదనతో కొత్త ఇల్లు కొనుగోలు చేశారు. మీ వయసు లేదా మీ వృత్తి ఎంత నిరాడంబరంగా ఉన్నా.. కొత్త సాంకేతికతకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలచుకోవచ్చు. సంపాదనను పెంచుకోవచ్చని” ఆనంద్ మహీంద్రా రాస్కొచ్చారు. ఆనంద్ ట్వీట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో రాజేష్ కుకింగ్ ఛానల్ చూసే వారి సంఖ్య పెరిగింది. రాజేష్ ను మాకు పరిచయం చేసినందుకు నెటిజన్లు ఆనంద్ మహీంద్రా కు ధన్యవాదాలు చెబుతున్నారు.