Africa Forest: సాధారణంగా క్రూర జంతువులను చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. అవి ఎదురుపడితే ప్రాణాలు కాపాడుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. అవి మీదికి వస్తుంటే కాళ్లకు పని చెప్పి పరుగు లంకించుకోవాలి అనిపిస్తుంది. కానీ క్రూర జంతువులు అందులోనూ సింహాలు ఒక సమూహంగా ఉన్నప్పుడు.. వాటిని చూసేందుకు మిగతావారు భయపడుతున్నప్పుడు.. ఒక వ్యక్తి బైక్ మీద అలా వెళ్తుండడం మీరు ఎప్పుడైనా చూశారా? కుటుంబంతో సహా సింహాల పక్కనుంచే ప్రయాణించడం మీరు ఎప్పుడైనా గమనించారా? డిస్కవరీ కాదు యానిమల్ ప్లానెట్ లోనూ ఇలాంటి వీడియోలు చూసి ఉండరు. ఎందుకంటే అంతటి సాహసానికి ఎవరూ ఒడిగట్టరు?
ఆఫ్రికన్ సఫారీలో..
ఇక ఈ వీడియో ఆఫ్రికన్ సఫారీ కి వెళ్ళిన ఓ వ్యక్తి తీశాడు. ఆఫ్రికన్ ఖండంలో చాలావరకు దేశాలు దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి అంతంత మాత్రం కాబట్టి.. అక్కడ అడవులు విస్తారంగా ఉన్నాయి. ఆదివాసి తెగలు ఉండడంతో అక్కడి అడవుల జోలికి ప్రభుత్వాలు వెళ్లడం లేదు. దీంతో అక్కడ జంతువులు విస్తృతంగా ఉన్నాయి. అక్కడ జంతువులు ఎక్కువగా ఉండడం వల్లే నమిబీయా, సౌత్ ఇక ఆఫ్రికా ప్రాంతాల నుంచి చీతాలను మన దేశానికి తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా లేని జీవవైవిధ్యం ఆఫ్రికా ఖండానికి మాత్రమే పరిమితం. అందుకే ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అరుదైన జంతువులను చూసి వెళ్తుంటారు.
జంతువులు విస్తారంగా ఉండడం, పంటలు పెద్దగా పండే అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతంలో పర్యాటకాన్ని అక్కడి ప్రభుత్వాలు అభివృద్ధి చేశాయి. వీటి ద్వారానే అక్కడి ప్రజలకు ఆదాయం సమకూరుతోంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఆ ప్రాంతాలకు చెందిన వారు టూరిస్ట్ గైడ్లు గా వ్యవహరిస్తుంటారు. పర్యాటకులు ఇచ్చిన పైసలతోనే జీవనం గడుపుతుంటారు.
ఇక ఇటీవల కొంతమంది ఆఫ్రికా అడవులకు సఫారీ వెళ్లారు. ఆ సమయంలో సింహాల గుంపు అక్కడి అడవిలో సేద తీరుతోంది. దీంతో వారంతా తమ వాహనాల్లోనే కూర్చుండిపోయారు. సింహాల హావభావాలను ఫోటోలు, వీడియోలు తీస్తూ ఆశ్చర్య చకితులవుతున్నారు. కానీ ఈ లోగా ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో సహా ద్విచక్ర వాహనంపై అటుగా వెళ్ళాడు. దీంతో ఒక్కసారిగా ఆ దృశ్యం చూసినవారు అలా కళ్ళు అప్పగించి ఉండిపోయారు. సింహాలు కూడా అలానే ఉండిపోయాయి. దీనిని వీడియో తీసిన ఒకతను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ” ఏరా మమ్మల్ని కుక్కలు అనుకున్నావా సింహాలు అనుకున్నావా” అని సింహాలు అనుకుంటున్నట్టు ఒక మీమ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదు చేసుకుంది.