Agra Couple: మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి. తినే తిండి శుభ్రంగా ఉండాలి. చుట్టూ పరిసరాలు ఆహ్లాదంగా ఉండాలి. అప్పుడే మన జీవితం సాఫీగా సాగుతుంది. ఎటువంటి రోగాలు లేకుండా ఉంటుంది. అదే చుట్టూ మురుగు ఉండి.. వ్యర్ధాలు ఉండి.. కంపు వాసన కొడుతుంటే ఎలా ఉంటుంది? వినడానికే ఇబ్బందిగా ఉంది కదా.. చదువుతుంటేనే చిరాకేస్తోంది కదా.. కానీ అలాంటిది ఆ దంపతులు కొన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీంతో వారు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. అధికారుల తీరును నిరసించారు. ప్రస్తుతం వారు చేసిన పని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీలోని ఆగ్రా ప్రాంతంలో భగవాన్ శర్మ, ఉషా దేవి అనే దంపతులున్నారు. వీరికి గత 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భగవాన్ శర్మ పూర్వికుల ది ఆగ్రా ప్రాంతం. పెళ్లయిన తర్వాత కూడా భగవాన్ శర్మ అదే ప్రాంతంలో ఉంటున్నాడు. అయితే గతంలో ఆగ్రా ప్రాంతం చాలా స్వచ్ఛంగా ఉండేది. రాను రాను మురికి కూపం లాగా మారిపోయింది. పరిశ్రమ వ్యర్ధాలు వారు ఉంటున్న ఇండ్లను ముంచెత్తడం ప్రారంభమైంది. దీంతో వారు ఆ మురికి మధ్య జీవనం సాగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో తమ సమస్యపై వారు ఆగ్రా పురపాలక అధికారులకు.. అక్కడి ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. ఆ మురికి మధ్య జీవించడం అనేది వారికి అతి పెద్ద సవాల్ అయిపోయింది. దీనికి తోడు వ్యాధులు కూడా వ్యాపిస్తుండడంతో ఆ కుటుంబం చాలా తీవ్ర ఇబ్బంది పడుతోంది. దీంతో వారు తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని మురికి కాల్వ పక్కన జరుపుకున్నారు. భగవాన్ శర్మ, ఉషాదేవి దండలు మార్చుకున్నారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రోడ్డు పక్కన ఉన్న ఆ మురుగును చూసి ఆగ్రా పురపాలక అధికారులపై నెటిజెన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. భగవాన్ శర్మ దంపతులు చేసిన పనిని అభినందిస్తున్నారు. నిరసన ఇలా తెలిపితేనే అధికారులకు అర్థమవుతుందని వారిని కొనియాడుతున్నారు.
వాస్తవానికి ఆగ్రా ప్రాంతం ఒకప్పుడు చాలా స్వచ్ఛంగా ఉండేది. పరిశ్రమలు పెరగడంతో ఆ ప్రాంతం మొత్తం మురికి కూపం లాగా మారిపోయింది. వ్యర్ధాలు, మురుగు నీరు ముంచెత్తడంతో ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ మురికి ప్రాంతానికి ఆగ్రా అధికారులు పుష్పదీప్ అని పేరు పెట్టడం విశేషం. ఆ మురుగు ముంచెత్తే ప్రాంతంలో సుమారు 10 నుంచి 12 వేల వరకు జనాభా నివసిస్తున్నారు. నాగ్లా కాళి, రాజ్ రాయ్, సెమ్రీ ప్రాంతాలలో వీరు జీవిస్తున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంతో రోడ్లమీదనే మురుగునీరు పారుతుంది.. ఈ ప్రాంతంలో వివిధ పాఠశాలలు ఉన్నాయి.. అందులో చదువుకునేందుకు వెళ్లే విద్యార్థులు రోజూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇక భగవాన్ శర్మ, ఉషా దేవి వివాహ వార్షికోత్సవాన్ని మురుగు కాలువ పక్కన జరుపుకున్న నేపథ్యంలో.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆగ్రా మునిసిపాలిటీకి చెందిన భాను చంద్ర గోస్వామి అనే అధికారి స్పందించారు. ” మురుగు ముంచెత్తే ప్రాంతాల మేము గుర్తించాం. క్షేత్ర స్థాయిలో మేము పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక బృందాన్ని అక్కడికి పంపిస్తున్నాం. నివేదిక అందించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని” ఆయన వివరించారు.