Amigos Trailer Review: బింబిసార చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కారు కళ్యాణ్ రామ్. సోసియో ఫాంటసీ సబ్జెక్టుతో మెమరబుల్ సక్సెస్ అందుకున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో అతి పెద్ద విజయంగా బింబిసార నిలిచింది. యంగ్ డైరెక్టర్ వశిష్ట్ తన టేకింగ్ తో ఆకట్టుకున్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలో కళ్యాణ్ మెస్మరైజ్ చేశారు. బింబిసార విడుదలైన నెలల వ్యవధిలో, కళ్యాణ్ రామ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. అదే అమిగోస్. టైటిల్ తోనే కళ్యాణ్ రామ్ సినిమాపై ఆసక్తి పెంచారు. అమిగోస్ అంటూ మనకు పరిచయం లేని పదాన్ని టైటిల్ గా ఎంచుకున్నారు.
అమిగోస్ ఒక స్పానిష్ వర్డ్. ఫ్రెండ్, ముఖ్యంగా మేల్ ఫ్రెండ్ అనే అర్థంలో ఇది వాడతారు. కళ్యాణ్ అమిగోస్ మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. ఒకే పోలికలు కలిగిన ముగ్గురు వ్యక్తులు ఎదురవుతారు. చూడడానికి సేమ్ గా ఉన్న కారణంతో స్నేహం చేస్తారు. అయితే ఆ ముగ్గురిలో ఒకరు చాలా డేంజరస్. మాఫియా లీడర్. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రైమ్ టార్గెట్. మాఫియా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ వ్యక్తి మిగతా ఇద్దరికి ఎందుకు దగ్గరయ్యాడు? అసలు ఆ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏమిటీ? అనే సందేహాల సమాహారమే అమిగోస్ చిత్రం.
రెండు నిమిషాల ట్రైలర్ యాక్షన్, రొమాన్స్, కామెడీ, సస్పెన్సు అంశాలతో కూడి ఉంది. మూడు డిఫరెంట్ గెటప్స్ లో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు. ఆయనకు ఈ చిత్రం మరో సాహసమని చెప్పొచ్చు, కారణం ఇలాంటి సబ్జక్ట్స్ కి స్క్రీన్ ప్లేనే కీలకం. టైట్ స్క్రీన్ ప్లేతో ఉత్కంఠ రేపుతూ కథ నడిపించాలి, లేదంటే ఫలితం దెబ్బేస్తుంది. దర్శకుడు రాజేందర్ రెడ్డి అమిగోస్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించారు. ఆమె గ్లామర్ ఆకట్టుకుంటుంది. కథలో ఆమెకు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి.
బ్రహ్మాజీ, సప్తగిరి కీలక రోల్స్ చేస్తున్నారు. బాబాయ్ బాలయ్య హిట్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదే వెన్నెలమ్మ’ రీమిక్స్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా గతంలో కళ్యాణ్ రామ్ ‘హరే రామ్’ టైటిల్ తో సైకలాజికల్ థ్రిల్లర్ చేశారు. మంచి కాన్సెప్ట్ అయినపప్పటికే స్క్రీన్ ప్లే, టేకింగ్ కుదరక విజయం సాధించలేదు. ఆ సినిమాతో అమిగోస్ కి పోలికలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా అమిగోస్ చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 10న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు.