
KCR- Amit Shah:మొన్న అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. సిఐఎస్ఎఫ్ పరేడ్ లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు వాషింగ్ పౌడర్ నిర్మా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బిజెపిలో చేరకముందు అవినీతిపరులు.. చేరిన తర్వాత సర్వ పరిత్యాగులు అని అర్థం వచ్చేలా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు.. ఇది మీడియాలో ప్రముఖంగా రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది.. ఈ ఫ్లెక్సీలు భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.. మరి ఈ లెక్కన కెసిఆర్ వాషింగ్ పౌడర్ నిర్మాకు అతీతుడా.. ఆయన కింద మరకలు లేవా? అంటే ఉన్నాయి. గురిగింజ తన కింది నలుపును ఎరుగదు అన్నట్టుగా.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నాయకుల వ్యవహార శైలి ఉంది.
చెప్పంగ వినకపోతే చెడంగా చూడవలసి వస్తుంది అని ఒక సామెత. ఇది మరింత కటువుగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితికి భారత రాష్ట్ర సమితి నాయకులు కచ్చితంగా దీనిని అన్వయించుకోవాలి.. మానవానుభవం పదేపదే ధ్రువపరుస్తూ వచ్చినా, మానవ చాపల్యం మాత్రం వివేకాన్ని ఎడం పెడుతూనే వస్తోంది. అధికారం, విపరీతమైన అధికారం, ఎప్పుడూ తన ప్రాబవం శాశ్వతం అనుకుంటూ సత్యాలను ఆలకించదు. ఫలితం, కాలిన చేతులను చలువపరిచేందుకు మహారాణ్యాలే ఆకులు రాలిన అడవులయ్యాయి. అందుకే, సంభాషించాలంటే, నొయ్యకుండా చెవులు కుట్టే విద్య ఏదో కావాలి. అభిమాన శల్యాన్ని కలవరపెట్టకుండా, పూర్వాపరాల విచికిత్స ఏమైనా చేయగలమేమో చూడాలి.
“లిక్కర్ కుంభకోణంలో నిజంగా కుంభకోణం ఉందా, ఉంటే అందులో కలవకుండా కవిత నిజంగా పాలుపంచుకున్నారా వంటి ప్రశ్నలు ఎవరూ వేయడం లేదు. ఆ ప్రశ్నలకు ఏ సమాధానం వచ్చినా, ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉన్నట్టు లేదు. కవిత కూడా తన ప్రమేయం గురించిన వివరాలను ప్రస్తావించి, వాటికి ఖండనలు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశం మాత్రమే ఇక్కడ బోనులో ఉన్నది తప్ప, భారత రాష్ట్ర సమితి నాయకులపై అవినీతి ఆరోపణలు కావు.. అమిత్ షాకు స్వాగతం చెప్పిన వాషింగ్ పౌడర్ హోర్డింగ్ ఇచ్చే సందేశం కూడా ఇదే” అని భారత రాష్ట్ర సమితి నాయకులు చెబుతుంటారు కానీ.. తమ కింది మరకలు మాత్రం చూసుకోలేరు.

ఇక కేంద్రం ఉక్క పోతకు గురిచేస్తుంది కాబట్టి కెసిఆర్ కు ఎంతో కొంత గతకాల అనుభవం గుర్తుకొస్తుంది. ఎమ్మెల్సీ కవిత కూడా కాస్త ఆలస్యంగా మహిళా రిజర్వేషన్ నెత్తికెత్తుకున్నారు. కానీ ఇక్కడే చాలామంది నొసలు ఎగిరాయి. ఇక్కడ కెసిఆర్ అ లక్ష్యాలు, నిర్లక్ష్యాలు తిరిగి చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి మహిళా అన్నది కేసీఆర్ కు అభిమానమైన అంశం కాదు. వారసత్వ, బంధుత్వ రాజకీయాలు సహజమని భావించే కేసిఆర్.. మాత్రం ఇవ్వగలిగినంత ప్రాధాన్యం ఇచ్చారని అనిపించదు. మొదటి అధికారకాలంలో రాష్ట్ర క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి లేరు. కోర్టు ఆదేశిస్తే తప్ప మహిళా కమిషన్ చైర్పర్సన్ నియామకం చేయలేదు. ఏ విషయాన్ని అప్రధానం అనుకున్నారో.. ఇప్పుడు అదే ఆపద్ధర్మం అయింది. కవిత విషయంలో బండి సంజయ్ చేసిన వివాహస్పద వ్యాఖ్యలపై వెంటనే మహిళా కమిషన్ వచ్చింది వరంగల్ జిల్లా చెందిన ఓ మాజీ మంత్రి విషయంలో ఆస్పందన ఇంతవరకు వచ్చిందో ఇంకా తెలియలేదు. వ్యవస్థలను వాటి దారిన వాటిని పనిచేస్తే ఇటువంటి సందర్భాలలో అవి కల్పించుకుంటే ఎంతో సహజంగా, అర్థవంతంగా ఉండేది. అవసరార్థం మాత్రమే ఒక ఉద్యమాంశాన్ని, ఒక సంస్థను ఉపయోగించుకుంటే, అందుకు ఏమంత గౌరవం సమకూరదు.. అందుకే కవిత ఆందోళనలో సామాన్య ప్రజల భాగస్వామ్యం కనిపించలేదు..
ఈ మధ్య కాలంలో తన ఉద్యమ సహచరులకు కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించారు.. ఇప్పటి వరకైనా గుర్తించినందుకు సంతోషించాల్సిందే కానీ ఆలస్యం ఖరీదు చాలా ఎక్కువ. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రభ బాగా తగ్గిపోయిన తర్వాత, కెసిఆర్ జనాకర్షణ కూడా నిద్రాణ పరిపాలన వల్ల క్షీణిస్తూ వస్తున్నప్పుడు ఇలా ఆకులు పట్టుకోవాల్సి వచ్చింది.. ప్రస్తుత సన్నివేశంలో కేసీఆర్ కు సానుకూల వాతావరణం ఇంత కొంత కనిపిస్తోంది అంటే దానికి కారణం కేసీఆర్ కాదు.. ప్రతిపక్షాల అనైక్యత. ప్రత్యర్థులు ఎప్పుడు కూడా అనైక్యంగా ఉంటారు అని అనుకోవద్దు. ఉద్యమ పార్టీగా ఉండకుండా తానే నిరోధించుకున్నారు. ప్రాంతీయ పార్టీగా కూడా మిగలకుండా తనను తానే బలహీనపరుచుకున్నారు. ఈ సందర్భంలో నిర్మా వాష్ పౌడర్ ఉదంతాన్ని కెసిఆర్ కు అన్వయించకుండా ఉండలేము.