Operation Kaveri : అత్యవసర సమయాల్లో భారత సైనికా దళ సాహసాలు అజరామరంగా నిలుస్తాయి. గొప్పతనాన్ని కీర్తిస్తూ చిత్రీకరించిన కొన్ని సినిమాలు ఆద్యంతం రక్తికట్టిస్తుంటాయి. అటువంటి మరో ఆపరేషన్ కు భారత వైమానిక దళం నిర్వహిస్తోంది. దాని పేరే ‘‘ఆపరేషన్ కావేరీ’’. సూడాన్ అంతర్యుద్ధం నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఈ ఆపరేషన్ ను భారత ప్రభుత్వం చేపట్టింది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో భారత పౌరులను తరలించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
సూడాన్ లో రెండు వర్గాల మధ్య పోరు మొదలైన వెంటనే భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తమ పౌరులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ బాధ్యతను భారత వైమానిక దళానికి అప్పగించింది. 2021లో అఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు యుద్ధం ప్రకటించిన అనంతరం పరిస్థితులు చాల క్లిష్ట దశకు చేరుకున్నాయి. అక్కడి భారతీయులను తీసుకువచ్చేందుకు ‘‘ఆపరేషన్ దేవీశక్తి’’ని చేపట్టింది. ఈ డేరింగ్ ఆపరేషన్ కు C-130J విమానానికి గ్రూప్ కెప్టెన్ గా రవి నందా నాయకత్వం వహించారు. ఆయన ధైర్య సాహసాలను మెచ్చి భారత ప్రభుత్వం గ్యాలంటరీ మెడల్ ను ఇచ్చి సత్కరించింది. కాగా, ఆపరేషన్ కావేరీ బాధ్యతను కూడా భారత ప్రభుత్వం ఆయనకే అప్పగించింది.
సూడాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు సీ-130 వాయుసేన విమానాలు రెండు, మూడు నావికాదళ నౌకలు INS సుమేధ, INS తర్కష్, INS తేగ్‌ను ఉపయోగిస్తున్నారు.
పౌరులను తరలించే క్రమంలో పెట్రోల్, డీజిల్ సహా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. తాత్కాలికంగా అక్కడ భోజన, నీటి వసతులను కల్పిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి ఉత్తరాన సముద్ర తీరాన ఉన్న పోర్ట్ సూడాన్‌కు తరలిస్తున్నారు.
ముమ్మరంగా సాగుతున్న ఆపరేషన్ కావేరీకి సంబంధించి ఏప్రిల్ 27 నుంచి 28వ తేదీ మధ్య జరిగిన సాహసోపేత ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ ను వెల్లడించింది.
సూడాన్ రాజధాని ఖార్తూమ్ లో జరుగుతున్న ఘర్షణలను తప్పించుకొని భారత పౌరులను క్షేమంగా తరలించాలి. ఈ ఆపరేషన్ కు సీ-130 వాయుసేన విమానం భాగమైంది. చిమ్మ చీకట్లో నిర్మానుష్యంగా ఉన్న సయిద్నాలోని చిన్నపాటి రన్ వేను ఎంచుకున్నారు. ముందుగా సాయుధులు ఎవరు లేరని నిర్ధారించుకున్నారు. తరలించాల్సిన వారిలో చిన్నారులతో పాటు గర్భిణీ కూడా ఉంది. వారికి ఏ విధమైన అపాయం తలెత్తకుండా జాగ్రత్తగా విమానం దగ్గరకు చేర్చాల్సి ఉంది. విమానం ల్యాండ్ అవ్వాలంటే అత్యవసర సాయం అవసరం. అన్నింటికంటే రన్ వే బాగుండాలి. లైట్లు అవసరం అక్కడ ఆ సదుపాయాలేవీ లేవు. రన్ వే అంతా గతుకులు, లైట్లు కూడా లేవు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో చీకట్లో కనిపించేందుకు ఇన్ ఫ్రారెడ్ సెన్సార్లు, నైట్ విజన్ గాగుల్స్ ను ఉపయోగించారు.
ప్రయాణీకులందరు ఎక్కే వరకు చాలా జాగ్రతలు తీసుకున్నారు. విమానం ఇంజిన్ ను ఆన్ చేసే ఉంచారు. టేకాఫ్ వరకు నైట్ విజన్ గాగుల్స్ ను ధరించే ఉన్నారు. అత్యంత ఒత్తిడిలో జరిగిన ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు అందరూ ఊపిరి బిగబట్టుకునే ఉన్నారు. అలా మొత్తం 121 మందిని సయిద్నా నుంచి జెడ్డాకు తరలించారు. అక్కడ నుంచి భారత దేశానికి తీసుకువచ్చారు. వాయుసేన ధైర్య సాహసాలను వారితో పాటు వచ్చిన ప్రయాణికులు, ఎదురైన అనుభవాలను ఇక్కడి మీడియాతో పంచుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1500 మంది వరకు భారత పౌరులను తీసుకువచ్చారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.