
సాధారణంగా జంతువుల, పక్షుల తల్లులు పిల్లలకు ఆహారం సంపాదించుకోవడం, జీవించడం, ప్రమాదాలు ఎదురైన సమయంలో తప్పించుకోవడం నేర్పిస్తూ ఉంటాయి. కానీ ఒక పక్షి మాత్రం తన పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తోంది. పక్షి పిల్లలకు డ్యాన్స్ నేర్పించడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా…? వినడానికి కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నిజంగానే ఒక తల్లి పక్షి తన రెండు పిల్ల పక్షులకు డ్యాన్స్ నేర్పిస్తోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పక్షి పిల్లలకు డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. సినిమాల్లో కొరియోగ్రాఫర్స్ ఏ విధంగా డ్యాన్స్ నేర్పిస్తారో అదే విధంగా తల్లి పక్షి పిల్ల పక్షులకు డ్యాన్స్ నేర్పిస్తోంది. వయ్యారంగా ఊగుతూ తల్లి పక్షి, పిల్ల పక్షులు వేస్తున్న స్టెప్పులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. బ్యూటెంగేబీడెన్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియో సోషల్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
పక్షుల డ్యాన్స్ కు అనుగుణంగా మ్యూజిక్ యాడ్ చేయడం వీడియోకు మరింత ప్లస్ అయింది. అమేకా వుడ్ కాక్ అనే తల్లి పక్షి ఏ విధంగా స్టెప్పులు వేస్తుందో పిల్ల పక్షులు కూడా అదే విధంగా స్టెప్పులు వస్తున్నాయి. పక్షుల వయ్యారమైన కదలికలు ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేలా చేస్తున్నాయి. తల్లిపక్షి, పిల్ల పక్షుల స్టెప్పులను తప్పక చూసి తీరాల్సిందే.