Avatar 2: 2009లో ప్రపంచ సినిమా ఓ అద్భుతాన్ని చూసింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో విడుదలైన అవతార్, మూవీ లవర్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. భూమిని వీడి జీవం ఉన్న మరో గ్రహంలోకి వెళితే ఇలానే ఉంటుందేమో అన్నంతగా కామెరూన్ ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేశారు. గాల్లో వేలాడే కొండలు. మెరిసే అడవులు, దగ్గరగా కనిపించే గ్రహాలు, విచిత్ర జంతువులు… అన్నింటికీ మించి నీలి రంగులో తోక కలిగిన పది అడుగుల మనుషులను పోలిన జాతి. మనుషుల ఊహకు తెలియని కొత్త ప్రపంచం కామెరూన్ సృష్టించాడు. అవతార్ సినిమాకు ప్రేక్షకులు దాసోహం అన్నారు. 2.92 బిలియన్ డాలర్స్ వసూళ్లతో వరల్డ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

ఈ క్రమంలో అవతార్ సీక్వెల్ పై సహజంగానే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అవతార్ చిత్రానికి మించి అవతార్ 2 ఉండేలా జేమ్స్ కామెరూన్ రూపొందించాలి అనుకున్నారు. పార్ట్ 2 థియేటర్స్ లోకి తేవడానికి ఆయన ఏకంగా 13 ఏళ్ల సమయం తీసుకున్నారు. డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ విడుదలైన అవతార్ ది వే ఆఫ్ వాటర్… నిర్మాణం వెనుక అద్భుత విషయాలెన్నో ఉన్నాయి అవేమిటో చూద్దాం…
అవతార్ 2 బడ్జెట్ 250 మిలియన్ డాలర్స్. భారత కరెన్సీలో అక్షరాల రూ. 2067 కోట్లు. ఐదు ఆర్ ఆర్ ఆర్ చిత్రాల బడ్జెట్ తో సమానం. ఇది అవతార్ 1 కంటే అధికం. అవతార్ చిత్ర బడ్జెట్ 237 మిలియన్ డాలర్స్. అవతార్ విడుదలకు ముందే అనేక అంతర్జాతీయ అవార్డ్స్ అందుకుంది. ప్రపంచ సినిమా వేదికపై అవతార్ 2 సత్తా చాటింది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ నామినేషన్స్ అవతార్ 2 దక్కించుకుంది. జ్యూరీ సభ్యులు బెస్ట్ మోషన్ పిక్చర్ డ్రామా, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో నామినేట్ చేశారు.
చైనాలో హాలీవుడ్ చిత్రాలకు పెద్దగా మార్కెట్ ఉండదు. మేకర్స్ అక్కడ విడుదల చేసేందుకు ఆసక్తి చూపించరు. అవతార్ 2 చైనాలో భారీ ఎత్తున విడుదలైంది. ప్రీ బుకింగ్స్ లో అవతార్ 2 దుమ్మురేపింది. వరల్డ్ వైడ్ అవతార్ సీక్వెల్ 160 భాషల్లో విడుదలైంది. భారత్ లో ఆరు భాషల్లో విడుదల చేశారు. టైటానిక్ మూవీలో హీరోయిన్ గా నటించిన కేట్ విన్స్లెట్ అవతార్ 2 మూవీలో కీలక రోల్ చేశారు. 25 ఏళ్ల తర్వాత కామెరూన్-కేట్ విన్స్లెట్ కలిసి మూవీ చేశారు.

తన క్రియేటివిటీకి తెర రూపం ఇచ్చేందుకు సోని కంపెనీతో కలిసి కామెరూన్ సరికొత్త కెమెరా డెవలప్ చేయించారు. నీటిలో అధిక భాగం షూట్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో నటులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అవతార్ ప్రాంచైజీలో అవతార్: ది సీడ్ బేరియర్, అవతార్: టుకున్ రైడర్, అవతార్: ది క్వెస్ట్ ఫర్ ఎవా అనే మరో మూడు చిత్రాలు రానున్నాయి.