Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని హైదరాబాద్ పోలీసులు నేడు అరెస్ట్ చేసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 5వ తారీఖున పుష్ప 2 చిత్రం విడుదలై భారీ విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. నాల్గవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోస్ వేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో ప్రీమియర్ షో అభిమానులతో కలిసి చూసేందుకు అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా విచ్చేయగా, ఆయన్ని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసిలాట జరగడం తో రేవతి అనే మహిళ మృతి చెందింది. అల్లు అర్జున్ ముందస్తు సమాచారం ఇవ్వకుండా థియేటర్ కి వచ్చారని. అయినప్పటికీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశామని. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఒకరు మృతి చెందారని, దీనికి అల్లు అర్జున్ భాద్యులు అని పోలీసులు ఆయన్ని తప్పు పట్టు FIR నమోదు చేసారు.
నేడు ఆయన ఇంట్లో ఉండగా పోలీసులు విచ్చేసి అరెస్ట్ చేసి విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఆయన పై 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసారు. ఇది బెయిలబుల్ వారెంట్ అట. 5 నుండి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అల్లు అర్జున్ కావాలని చేసిన పని కాదని, అదొక దురదృష్టకరమైన సంఘటన అని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయని, అప్పుడు ఇలా చేయలేదని, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసారని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ కేసు లో కేటీఆర్ ని నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ సమాచారం వెళ్ళింది.
జనాలు ఇది తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం ఉందని గమనించిన ప్రభుత్వం అల్లు అర్జున్ అరెస్ట్ ద్వారా ఆ మ్యాటర్ ని పక్కదోవ పట్టించి, కేటీఆర్ ని సైలెంట్ గా లోపలకు వేసే ప్లాన్ అని సోషల్ మీడియా లో అభిమానులు మండిపడుతున్నారు. మరి అల్లు అర్జున్ ఈ కేసు నుండి బయటపడుతాడా లేదా, చిరంజీవి సహకారం, పవన్ కళ్యాణ్ సహకారం అందుతుందా. ఇప్పటికే అల్లు అర్జున్ తెలంగాణ హై కోర్టు లో దీని పై బెయిల్ దరఖాస్తు చేసి ఉన్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయిలు డొనేషన్ అందించాడు. ఆమె పిల్లలకు జీవితాంతం అండగా ఉంటానని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఆయన తన ఇంస్టాగ్రామ్ ద్వారా విడుదల చేసాడు. సక్సెస్ మీట్ లో కూడా ప్రత్యేకంగా మాట్లాడాడు.