Ajith Fan Died: అభిమానం పేరుతో విపరీత చర్యలకు పాల్పడి అన్యాయంగా ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోతున్నారు. ఫ్లెక్సీలు కడుతూ కరెంట్ తీగలు తగిలి, ఎత్తైన ప్రదేశాల నుండి జారిపడి చనిపోయిన అభిమానులు ఎందరో ఉన్నారు. అభిమానం మత్తులో చేసే అనాలోచిత చర్యల వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా చెన్నైలో అజిత్ అభిమాని ఒకరు అత్యుత్సాహం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ సభ్యులకు తీరని వేదన మిగిల్చాడు. చెన్నై నగరంలోని కోయంబేడు ఏరియాలో గల రోహిణి థియేటర్ కి తునివు సినిమా చూసేందుకు ఒక అభిమాని మిత్రులతో వెళ్ళాడు.

ఫ్రెండ్స్ తో కలిసి అభిమాన హీరో మూవీ చూసి ఎంజాయ్ చేశాడు. అనంతరం బయటకు వచ్చి ఫ్యాన్స్ తో పాటు హంగామా చేశాడు. రోడ్లపై పెద్ద మొత్తంలో జనం చేరడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలు నిలిచిపోయాయి. అందరికీ కనిపించాలనే ఉద్దేశంతో సదరు అభిమాని ఒక భారీ వాహనం మీదకు ఎక్కాడు. అజిత్ పేరుతో పెద్దగా అరుస్తూ, నినాదాలు చేశాడు. ఈ క్రమంలో వాహనం మీద నుండి అదుపుతప్పి రోడ్డుపై పడ్డాడు. అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో… అక్కడే ఉన్న మిత్రులు ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అభిమానం హద్దులు దాటి పిచ్చి పనులు చేస్తే ఇలాంటి పర్యవసానాలు ఎదురవుతాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పలువురు హితవు పలుకుతున్నారు. 20 ఏళ్ళు కూడా నిండని కుర్రాడి జీవితం అర్థాంతరంగా ముగిసిందని మరికొందరు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తమిళనాడులో అభిమానులు విపరీత ఆలోచనలు కలిగి ఉంటారు. నచ్చిన హీరో కోసం ఎంతకైనా తెగిస్తారు. అజిత్ అభిమాని ఒకరు ఆయన కట్ అవుట్ కోసం రూ. 70 లక్షలు ఖర్చు చేశాడని సమాచారం. ఇక అజిత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. హత్యలు కూడా చోటు చేసుకున్నాయి. జనవరి 11న తునివు, వారిసు చిత్రాల విడుదల నేపథ్యంలో చెన్నైలో పలు చోట్ల గొడవలు జరిగాయి. ఓ థియేటర్ విషయంలో అభిమానులు కొట్టుకున్నారు.