
Goldman Sachs On AI: ఇప్పటికే ఆర్థిక మాంద్యం బూచి ని చూపే పెద్ద పెద్ద ఐటీ సంస్థలు అడ్డగోలుగా ఉద్యోగాలలో కోత విధిస్తున్నాయి. భవిష్యత్తు ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో కత్తెర వేస్తున్నాయి. గూగుల్ అయితే కొత్త ప్రాజెక్టుల జోలికి పోవడం లేదు. అమెజాన్ తన అనుబంధ వ్యాపారాలు మొత్తం క్లోజ్ చేసే పనిలో ఉంది. ఆపిల్ కూడా ఇప్పట్లో కొత్త యూనిట్లను ప్రారంభించే ఆలోచన లేదని తేల్చి చెప్పేసింది. ఇక ట్విట్టర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇక బహుళ జాతి సంస్థ అసెంచర్ కూడా 13వేల ఉద్యోగాలను అడ్డగోలుగా కోసి పడేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఐటీ ఉద్యోగుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా ఉంది.. ఇప్పుడు ఇదీ చాలదన్నట్టు కృత్రిమ మేథ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
నానాటికీ తన పరిధి పెంచుకుంటూ పోతున్న ‘ఉత్పాదక కృత్రిమ మేధ’ (జనరేటివ్ ఏఐ) దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని.. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజా నివేదికలో అంచనా వేసింది. ముఖ్యంగా.. ఆటోమేషన్‌తో ఎక్కువ పనులు అయిపోయే రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాల్లోని ఉద్యోగాల్లో మూడింట రెండొంతుల మేర ఉద్యోగాలను ఎంతో కొంత ఆటోమేషన్ ద్వారా చేయించుకోవచ్చని వెల్లడించింది. అదే సమయంలో.. కృత్రిమ మేధ వల్ల ప్రపంచ జీడీపీ 7 పెరుగుతుందని తెలిపింది. శారీరక శ్రమ అవసరమయ్యే ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండదుగానీ.. ఆఫీసు నిర్వహణ సంబంధిత ఉద్యోగాలు ఆటోమేట్ అయ్యే అవకాశం 46 ఉందని, ఆ ఉద్యోగాలన్నింటినీ ఏఐ ఆక్రమిస్తుందని హెచ్చరించింది. న్యాయవ్యవస్థకు సంబంధించిన ఉద్యోగాల్లో 44% ఆర్కిటెక్చర్ ఉద్యోగాల్లో 37% ఉద్యోగాలకు ఏఐ ముప్పు పొంచి ఉందని పేర్కొంది.

ఏమిటీ జనరేటివ్ ఏఐ
ఉత్పాదక కృత్రిమ మేధ (జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ఉదాహరణ.. చాట్ జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం ఒక్కముక్కలో అనేస్తాంగానీ.. అది చాలా రకాలు ఉంటుంది. వాటిలో ఒక రకం జనరేటివ్ ఏఐ. తనవద్ద ఉన్న నిర్దిష్టమైన డేటా ఆధారంగా.. కొత్తగా టెక్స్ట్, చిత్రాలు, వీడియోలు, త్రీడీ మోడళ్లను సృష్టించగలిగే కృత్రిమ మేధ ఇది. ఉదాహరణకు మీరు చాట్‌జీపీటీని ‘సి’ లాంగ్వేజ్‌లో ఒక ప్రోగ్రామ్ రాయాలని అడిగితే రాసిస్తుంది. అందుకే దాన్ని జనరేటివ్ ఏఐ అంటారు. అందుకే.. చాట్ జీపీటీ దెబ్బకు కంప్యూటర్ ప్రోగ్రామర్లు, కంటెంట్ క్రియేషన్ రంగాలకు సంబంధించిన ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.