
Indian Army Eagle Training: పూర్వం రాజుల కాలంలో పక్షులను వర్తమానాలు చేరవేసేందుకు ఉపయోగించేవారు. కొందరైతే ఇతర దేశాల రాజులను సంహరించేందుకు ఉపయోగించేవారు.. కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం మారింది. పక్షుల స్థానంలో ఇప్పుడు విమానాలు పనిచేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అధునాతనమైన యుద్ధ విమానాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయనప్పటికీ దేశభద్రత, ప్రముఖుల భద్రత కత్తి మీద సవాల్ గా మారింది.ఈ క్రమంలోనే నిఘా అధికారులు కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు.. పూర్వం ఉపయోగించిన పక్షులను నిఘా కోసం ఉపయోగిస్తున్నారు.
గద్దలకు శిక్షణ
పక్షుల్లో గద్దలు లేదా గరుడ పక్షులు పూర్తి విభిన్నమైనవి. వీటి దేహం చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రెక్కలు కూడా విస్తారంగా ఉంటాయి. కాళ్లు దృఢంగా ఉండటం వల్ల ఎంతటి శత్రువునైనా కాళ్లకున్న గోర్లతో చీల్చి చెండాడగలవు. పైగా వీటికి దూరదృష్టి ఎక్కువ. శత్రువు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఆ శబ్ద తరంగాల ద్వారా ఉనికిని గుర్తించగలవు. ఈ క్రమంలోనే వాటిని నిఘా కోసం మన అధికారులు ఉపయోగించనున్నారు. ప్రస్తుతం శత్రు దేశాల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు సరిహద్దుల్లో సైన్యంతో పాటు నెదర్లాండ్స్ వంటి కొన్ని దేశాల్లోనే ఈ గరుడ స్క్వాడ్ ను ఉపయోగిస్తున్నారు.
ప్రత్యేకంగా శిక్షణ
వివిఐపీలు, వీఐపీల పర్యటనల సమయంలో గగనతలలో నిషేధిత డ్రోన్లను గుర్తించి ధ్వంసం చేయడంలో గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. మావోయిస్టుల కట్టడి చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతంలో వారి కదలికలను గుర్తించేందుకు వీలుగా ఈ గద్దల దళం సిద్ధమవుతోంది. నిఘా విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మొయినాబాదులోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ గద్దల స్క్వాడ్ కిన్ అన్ని పనులు శిక్షణ ఇస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఇప్పటివరకు పోలీస్ జాగిలాలకు నిందితులను గుర్తించడం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలను గుర్తించడం వంటి అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కానీ తొలిసారిగా గద్దల స్క్వాడ్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన పక్షులకు శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం ఇద్దరు నిపుణులను నియమించారు. వారికి నెలకు ఒకరికి 35, 000, మరొకరికి 25, 000 గౌరవ వేతనం చెల్లిస్తున్నారు.

శిక్షణ ఇస్తున్న సమయంలో..
అయితే గద్దలకు శిక్షణ ఇస్తున్న క్రమంలో కొన్ని పక్షులు మృతి చెందినట్లు సమాచారం. ఇక ఈ గద్దల దళానికి సంబంధించి అవసరమైన పక్షి పిల్లలను అధికారులు నల్లమల్ల అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. అకాడమీ లోని ప్రత్యేక వాతావరణంలో వాటిని పెంచుతున్నారు. ఇప్పటికే ట్రయల్స్ కూడా నిర్వహించారు.. ఇవి డ్రోన్లను ఎలా ధ్వంసం చేస్తాయో ప్రాక్టికల్ గా డీజీపీ కి చూపించారు. దీంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేసి, మరిన్ని పక్షులకు ఇలాంటి శిక్షణ ఇవ్వాలని సూచించారు. సో మొత్తానికి గగనతలంలో డ్రోన్లను ధ్వంసం చేసే బాధ్యతను ఇకనుంచి గద్దలు తలకెత్తుకుంటాయన్నమాట!