
Brahmaji: పరిశ్రమలో మోస్ట్ రిస్కీ జాబ్ ప్రొడక్షన్. ప్రతి ఏడాది వందల చిత్రాలు విడుదల అవుతాయి. ఆడేది మాత్రం పది చిత్రాల లోపే. టాలీవుడ్ హిట్ పెర్సెంటేజ్ జస్ట్ 2%. అందుకే నిర్మాతలు రావడం పోవడం జరుగుతూ ఉంటుంది. నాలుగైదు నిర్మాణ సంస్థలు మాత్రమే దశాబ్దాల పాటు నిర్మాణ రంగంలో ఉన్నాయి. వరుసగా రెండు ప్లాప్స్ పడితే చిన్న నిర్మాతలు దుకాణం సర్దుకోవాల్సిందే. ఈ మధ్య కొంచెం పర్లేదు. డిజిటల్ రైట్స్ అంటూ అదనంగా మరో ఆదాయ మార్గం దొరికింది. కొన్ని చిత్రాలు థియేటర్స్ కలెక్షన్స్ తో సంబంధం లేకుండా డిజిటల్ రైట్స్ తోనే సేఫ్ జోన్ లోకి వచ్చేస్తున్నాయి.
పరిశ్రమలో నిలబడ్డ నిర్మాతలంతా అత్యంత జాగ్రత్త పరులు. పది రూపాయలు ఖర్చయ్యే చోట ఎనిమిది రూపాయలకు ఎలా ముగించాలా అని చూస్తారు. ప్రణాళికా బద్దంగా ఉండి అనుకున్న బడ్జెట్ దాటిపోకుండా చూస్తారు. ఈ తతంగం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… ఓ సీన్ షూట్ కోసం నటులు నిజంగా బీర్ తాగి లక్షల్లో బిల్ చేశారట. ఈ విషయాన్ని నటుడు బ్రహ్మాజీ స్వయంగా చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ #మెన్ టూ షూట్ లో ఇది జరిగిందట.
శ్రీకాంత్ జి రెడ్డి దర్శకత్వంలో తెరెకెక్కిన #మెన్ టూ మూవీలో బ్రహ్మాజీ కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర షూట్ వారం రోజులు ఒక పబ్ లో చేశారట. షూటింగ్ జరిగినన్ని రోజులు బ్రహ్మాజీతో పాటు ఇతర నటులు నిజమైన బీర్లు తాగారట. షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక బిల్లు చూసి నిర్మాత గొల్లుమన్నాడట. వారం రోజులు తాగిన బీర్లకు గాను ఏకంగా లక్షన్నర బిల్ వేశారట. నిర్మాతకు తప్పదు కాబట్టి పబ్ ఓనర్ కి బిల్లు మొత్తం చెల్లించి నిర్మాత బయటపడ్డారట.

ఈ విషయాన్ని బ్రహ్మజీ స్వయంగా వెల్లడించారు. ఇక టాలీవుడ్ సీనియర్ నటుల్లో బ్రహ్మాజీ ఒకరు. ఆయన మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. వందల చిత్రాల్లో నటించారు. కెరీర్ బిగినింగ్ లో హీరోగా కూడా నటించారు. దర్శకుడు కృష్ణవంశీ మిత్రుడు కావడంతో ఆయన తన సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఇచ్చారు. ఇక బ్రహ్మాజీ సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా, సెటైరికల్ గా తన అభిప్రాయం తెలియజేస్తూ ఉంటారు.