Aadhaar Card For Dogs: ‘ఆధార్’ కార్డు.. మనుషుల గుర్తింపు కోసం కేంద్రం తెచ్చిన యూనిక్ నంబర్. మరి నిత్యం మనుషుల మధ్యే .. మనుషులతోనే కలిసి జీవించే కుక్కల పరిస్థితి ఎలా అనే ఆలోచన ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ కు వచ్చింది.. దీనికి అక్షయ్ ఒక పరిష్కారాన్ని రెడీ చేశారు. ఆధార్ కార్డులో మనుషుల వివరాలను, బయో డేటాను, అడ్రస్‌ను ఎలాగైతే ఎంటర్ చేస్తారో.. అదే విధంగా వీధి కుక్కల వివరాలతో డిజిటల్ క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులను ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ రెడీ చేశారు.
విమానాశ్రయం వద్ద కుక్కలకు..
ఈ గుర్తింపు కార్డులను తొలి విడతగా ముంబై విమానాశ్రయం పరిసరాల్లో తిరుగుతున్న 20 వీధి కుక్కల మెడలో వేశారు. ఆ కుక్కలు ఉండే ఏరియా వివరాలు, వయసు సమాచారం, సంతానం కలుగకుండా స్టెరిలైజేషన్ చేశారా లేదా అనే సమాచారం, టీకాలు వేసిన వివరాలు, కుక్క తప్పిపోయినప్పుడు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్లు ఈ కార్డులో నమోదై ఉంటాయి. ఈ మొత్తం సమాచారాన్ని ఒక క్యూఆర్ కోడ్‌గా మార్చారు. దీనిని స్కాన్ చేస్తే .. కుక్కకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ప్రత్యక్షం అవుతాయి.
వీధికుక్కల ట్రాకింగ్ ఇక సులభం..
ముంబై నగరంలోని వీధి కుక్కలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా త్వరలో లొకేషన్ ఆప్షన్‌ను కూడా ఈ ఐడీ కార్డులకు జతపరుస్తామని ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్ వెల్లడించారు. pawfriend.in పేరుతో తాను నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో తాము ఐడీ కార్డులు ఇష్యూ చేసిన వీధి కుక్కల వివరాలు పొందుపరిచామని పేర్కొన్నారు. ఐడీ కార్డులు వేసే క్రమంలోనే ఆ 20 కుక్కలకు టీకాలు కూడా వేయించామని చెప్పారు. బాంద్రా వాసి సోనియా షెలార్ ముంబైలో దాదాపు 300 వీధి కుక్కలకు ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నారు. ఈక్రమంలో ఆమె ముంబై మున్సిపల్ కారొరేషన్‌కు చెందిన పశువైద్యుడు డా. కలీమ్ పఠాన్ pawfriend.in సభ్యులతో కలిసి పనిచేస్తున్నారు. ఆ డాగ్స్ కు టీకాలు వేయిస్తున్నారు. వాటికి ట్యాగింగ్ చేయిస్తున్నారు.