Karimnagar Student: వయసుతో సంబంధం లేకుండా హఠాన్మరణాలు సంభవిస్తున్న రోజులివి. గుండె సంబంధిత సమస్యలే అందుకు కారణం అవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కరీంనగర్ జిల్లాలోనూ ఓ స్కూల్ స్టూడెంట్ గుండె ఇలాగే ఆగింది. ఫ్రెషర్స్ వేడుకల్లో సంబురంగా చిందులేస్తున్న సమయంలోనే విద్యార్థిని కుప్పకూలింది. గంగాధర మండలంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్లో శుక్రవారం ఫ్రెషర్స్ డే ఈవెంట్ జరిగింది. విద్యార్థులంతా సంబురంగా వేడుకల్లో పాల్గొన్నారు. అతిథుల ప్రసంగం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ టాలెంట్ ప్రదర్శిస్తున్నారు.
సెకండియర్ విద్యార్థిని..
కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని ప్రదీప్తి కూడా డాన్స్ చేసేందుకు వేదికపైకి వచ్చింది. స్నేహితులతో కలిసి సుమారు అరగంటపాటు నృత్యం చేసింది. అంతా సంబురాల్లో ఉండగా ప్రదీప్తి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థినిని గంగాధర ఆసుపత్రికి తరలించారు. స్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని వైద్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉందని, కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు.
మార్గమధ్యంలోనే మృతి..
వైద్యుల సూచన మేరకు విద్యార్థినిని హుటాహుటిన కరీంనగర్ తరలిస్తన్న క్రమంలో మార్గమధ్యలోనే తనువు చాలించింది. మండల పరిధిలోని వెంకటరావుపల్లి గ్రామానికి చెందిన గూడు అంజయ్య కూతురు ప్రదీప్తి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుందని స్థానికులు తెలిపారు. ప్రదీప్తి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు.
డాక్టర్లు ఏం చప్పారంటే..
కరీంనగర్‌లో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఆమె మృతికి కారణాల కోసం పరీక్షలు నిర్వహించారు. ప్రదీప్తి గుండెకు రంధ్రం ఉందని గుర్తించారు. ఈ విషయం బంధువులకు చెప్పడంతో షాక్ అయ్యారు. ఈ కారణంగానే ప్రదీప్తి డ్యాన్స్ చే యడం వలన ఆయాసం పెరిగి స్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని వెల్లడించారు. అప్పటి వరకు తమ ముందే చలాకీగా నృత్యం చేసిన ప్రదీప్తి మృతిని పాఠశాల ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు జీర్ణించుకోలేకపోతున్నారు.