
China Man killed Chickens: పగ, ప్రతీకారం ఎటువంటి చర్యలకైనా పాల్పడేలా చేస్తుంది. పగతో రగిలిపోయే వ్యక్తి జాలి, దయ అనే విషయాలను కూడా మర్చిపోతాడు. తను పగ సాధించేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోడు. బీజింగ్ కు చెందిన ఓ వ్యక్తి పక్కింటి వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు విచిత్రమైన చర్యకు పాల్పడ్డాడు. ఆ చర్య ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సదరు వ్యక్తి చేసిన చర్య వల్ల సుమారు 1100 కోళ్లు భయభ్రాంతులకు గురై చనిపోయాయి.
చెట్లు నరికి వేయడంతో పెంచుకున్న కసి..
బీజింగ్ లో గూ, జోంగ్ అనే ఇద్దరు వ్యక్తులు పక్కపక్క ఇళ్లలో నివసిస్తుంటారు. గతేడాది ఏప్రిల్ లో జోంగ్.. గూ అనుమతి లేకుండా అతను చెట్లను నరికి వేశాడు. దీంతో అప్పటి నుంచి గూ పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ జోంగ్ కు చెందిన కోళ్ల ఫామ్ కు రాత్రి వేళల్లో పలుమార్లు వెళ్లేవాడు. కొద్దిరోజుల క్రితం ఒక రాత్రి జోంగ్ కోళ్ల ఫామ్ వద్దకు వెళ్లిన గూ.. సడన్ గా ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. దీంతో అవి భయభ్రాంతులకు గురై అన్ని ఒక మూలకు వెళ్లాయి. ఈ క్రమంలో ఒకదానిపై మరొకటి పడి 500 కోళ్లు చనిపోయాయి.
జోంగ్ ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన పోలీసులు..
జోంగ్ ఫిర్యాదు మేరకు గూను పోలీసులు అరెస్టు చేశారు. 500 కోళ్ల మరణానికి కారణమైనందుకు అతనికి రూ.35,713 జరిమానా విధించారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన గూకు పక్కింటి వ్యక్తిపై పగ మాత్రం చల్లారలేదు. మరోసారి తనను జైలుకు పంపించిన జొంగ్ పై మరింత ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.

ఈసారి మరణించిన 640 కోళ్లు..
తనను జైలుకు పంపించిన జోంగ్ కు మరింత నష్టం చేకూర్చాలని భావించిన గూ.. ఈసారి మళ్లీ కోళ్ల ఫామ్ కు వెళ్లాడు. ఇదివరకు చేసినట్లుగానే ఒక్కసారిగా మళ్లీ ఫ్లాష్ లైట్ ఆన్ చేశాడు. దీంతో కోళ్ల ఫామ్ లో ఉన్న 640 కోళ్లు మరణించాయి. పోలీసులు మళ్లీ అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. గూ కావాలనే జోంగ్ కోళ్లను చంపి నష్టం కలిగించేలా చేశాడని కోర్టు నిర్ధారించింది. అతనిని దోషిగా తేల్చి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధించింది. చనిపోయిన మొత్తం 1100 కోళ్ల విలువ రూ.1,60,000 కుపైనే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.