Hyderabad: పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇప్పుడు ఆడంబరాలు ఎక్కువైపోవడంతో కోటలు, ఫంక్షన్ హాల్లు, విదేశాలకు వెళ్లి మరీ ఈ వేడుక నిర్వహించుకుంటున్నారు. పెళ్లిలో ప్రతీ ఫ్రేములోనూ తమ మార్క్ ఉండాలని చూసుకుంటున్నారు. ఆ అత్యుత్సాహమే ఇప్పుడు వారికి ముప్పు తెచ్చిపెడుతోంది. ఓ పెళ్లికొడుకు ఉత్సాహం ఇప్పుడు అతడి ప్రాణాలు తీసింది.. పెళ్లి జీవితంలో ఒక్కసారి జరుపుకునే వేడుక.. ఈ వేడుకను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించేకునేందుకు నేటితరం ఆసక్తి చూపుతోంది. ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. ఇక వేడుకలో అందంగా కనిపించేందుకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. అయితే ఒక్కోసారి ఈ మేకోవర్ వికటిస్తోంది. గతంలో ఓ పెళ్లి కూతురు మేకప్ వికటించి ముఖం మొత్తం వాచిపోయింది. దీంతో పెళ్లి రద్దయ్యింది. తాజాగా ‘నవ్వు అందంగా ఉండేలా చేసుకోవాలని పళ్ల సెట్ సరిచేసుకునేందుకు ( స్మైల్ డిజైనింగ్ ) వెళ్లిన ఓ వరుడి ప్రాణమే పోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
చిరు నవ్వు కోసం..
ఫిబ్రవరి 16న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎఫ్‌ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్‌కు లక్ష్మీనారాయణ(28) వెళ్లాడు. తనకు పెళ్లి సెట్ కావడంతో చిరునవ్వు పెంచుకోవాలని.. పళ్ల సెట్ చేసుకోవాలని ఈ క్లినిక్‌ను సంప్రదించాడు. అయితే ఆపరేషన్ చేస్తుండగానే లక్ష్మీనారాయణ మరణించాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనస్థీషియా ఓవర్‌డోస్..
తన కొడుకు అనస్థీషియా ఓవర్‌డోస్ కారణంగా చనిపోయాడని లక్ష్మీనారాయణ తండ్రి రాములు ఆరోపించాడు. సర్జరీ సమయంలో తన కొడుకు స్పృహ తప్పి పడిపోయారని ఆస్పత్రి నుంచి తనకు ఫోన్ వచ్చిందని వెల్లడించారు. అర్జంట్‌గా క్లినిక్‌కు రావాలని సూచించారని తెలిపాడు. హుటాహుటిన ఆస్పత్రికి వచ్చామని, అప్పటికే లక్ష్మీనారాయణ చనిపోయాడని పేర్కొన్నాడు. ఆపరేషన్ గురించి తన కొడుకు ముందుగా తనకు తెలియజేయలేదని చెప్పాడు. తన కొడుకుకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని కన్నీరు పెట్టుకున్నాడు.
క్లినిక్‌పై కేసు..
రాములు ఫిర్యాదుతో పోలీసులు ఘటన స్థలాన్ని సంప్రదించారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. సెక్యూరిటీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. క్లినిక్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.
ఇలా అందం కోసం వెళ్లి ఓ పెళ్లి కొడుకు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అనస్తీషియా వైద్యుడి నిర్లక్ష్యం ఈ యువకుడి ప్రాణాలు తీసింది. అనవసర ఆపరేషన్లు.. ముఖ్యంగా అందం పెంచుకునే ఇలాంటి ఆపరేషన్ల వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా యువత ఆర్భాటాలు వీడితే అందరికీ మంచిదని అందరూ సూచిస్తున్నారు.