
Illegal Ventures In Khammam: రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు.. అతడు రెక్కలు కట్టుకొని వాలతాడు. రాత్రికి రాత్రే ఫెన్సింగ్ వేస్తాడు.. థిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అంటూ బోర్డు పెడతాడు. కాపలాకు కొంతమంది యువకుల్ని ఉంచుతాడు. ఈలోగా రెవెన్యూ శాఖ అధికారులను మచ్చిక చేసుకుంటాడు. కొద్దిరోజుల తర్వాత వాటిని వెంచర్లుగా మారుస్తాడు. దర్జాగా విక్రయించుకుంటాడు. కోట్లు సంపాదించుకుంటాడు.. ఇలా ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా అతడు ఏకంగా 150 కోట్లు సంపాదించాడు. ప్రభుత్వం ధరణి వంటి వెబ్ సైట్, అధునాతన సర్వే పరికరాలు, పూర్తిస్థాయిలో రెవెన్యూ ఉద్యోగులను కలిగి ఉన్న తర్వాత కూడా ఎందుకు భూములు ఆక్రమణకు గురవుతున్నాయో మీకు అంతు పట్టడం లేదా? మీ ప్రశ్నలో న్యాయం ఉంది.. కానీ అతడి వెనుక ప్రభుత్వమే ఉంది.. అందుకే అతడు ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది.
ఖమ్మం జిల్లాలో బేతుపల్లి గ్రామం ఆంధ్రకు సరిహద్దున ఉంటుంది. ఇక్కడ ఎకరం భూమి రెండు కోట్లకు పైచిలుకు పలుకుతుంది. పైగా గ్రీన్ ఫీల్డ్ హైవే రావడంతో భూములకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలో అసలే భూ బకాసురుడిగా పేరుపొందిన సదరు వ్యక్తి గ్రీన్ ఫీల్డ్ హైవే వెళుతున్న మార్గంలో సర్కారు భూములపై కన్నేసాడు.. వెంటనే ఆక్రమించాడు. కొంతమంది రైతుల భూములను కూడా వారికి తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించాడు.. దీనిపై కొంతమంది రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే… వారిపై దాడి చేసేందుకు కూడా వెనుకాడ లేదు. ఇందులో ఒక రైతు ను అపహరించి చిత్రహింసలకు గురి చేసినట్టు సమాచారం.. సదరు భూ బకాసురుడు ఆ ప్రాంత నయీం లాగా చలామణి అవుతున్నాడు.. ఇతడికి ఒక డెన్, 20 కుక్కలు, బలిష్టమైన వ్యక్తులు కాపలాగా ఉంటారు అంటే ఇతడి స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

ఇక బేతుపల్లిలో ఆక్రమించిన భూములకు సంబంధించి ఇటీవల కొంతమంది గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన కొంతమంది అధికారులను క్షేత్రస్థాయిలోకి పంపారు. వారు బాధిత రైతుల వాంగ్మూలం సేకరించి నివేదికను కలెక్టర్ కు అందజేశారు. అయితే దీని పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.. అయితే సదరు వ్యక్తికి ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ లో ఉన్న ఓ మాజీ ఎంపీ పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తున్నట్లు సమాచారం.. పైగా నూతన సంవత్సర సందర్భంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించిన అతడికి ఆర్థిక సహాయం అందించేందుకు భారీగా డబ్బు డంపు చేసినట్టు సమాచారం. పైగా రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతగా ఉన్న ఓ వ్యక్తికి ఇతడు కావలసిన వాడు.. అందుకే ఇతడు ప్రభుత్వ భూములు ఆక్రమించినప్పటికీ చర్యలకు అధికారులు వెనుకాడుతున్నట్టు సమాచారం.. గతంలోనూ సదరు భూ బకాసురుడు నకిలీ నోట్ల తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు.. ఓ అత్యంత కీలక ప్రజా ప్రతినిధి అండదండలు ఉండడంతో త్వరగానే బయటికి వచ్చాడు.. ఒక్క ఖమ్మంలోనే కాదు పలు జిల్లాల్లో ఇలాంటి నయా నయీమ్ లు సమాంతర వ్యవస్థలను నడుపుతున్నారు.. జనాలకు నరకం చూపిస్తున్నారు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించాం.. తెలంగాణ మొత్తం ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది… అని గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఇలాంటి వారిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోరు. పైగా దేశంలో గుణాత్మక మార్పు రావాలి అంటూ వీరలెవల్లో ఉపన్యాసాలు ఇస్తారు..నయా నయీం లను రక్షించడమేనా గుణాత్మక మార్పు అంటే?!