https://oktelugu.com/

Anantapur: పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఇంతలోనే ఘోరం

తాడిపత్రి మండలం చిన్న పొలమడ గ్రామానికి చెందిన మంజునాథ్(27), రమాదేవి(24)లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు.

Written By:
  • Dharma
  • , Updated On : August 9, 2023 / 02:56 PM IST

    Anantapur

    Follow us on

    Anantapur: వారిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. కలిసి బతకాలనుకుని పెద్దలను ఎదిరించారు. వారిని నప్పించి, ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆరు నెలల పాటు కాపురం కూడా చేశారు. అయితే ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ.. ఒకరి తరువాత ఒకరు బల్వన్మరణానికి పాల్పడ్డారు. ఇరు కుటుంబాల వారికి అంతులేని విషాదాన్ని మిగిల్చారు.అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది ఈ విషాద ఘటన. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    తాడిపత్రి మండలం చిన్న పొలమడ గ్రామానికి చెందిన మంజునాథ్(27), రమాదేవి(24)లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. దీంతో వారిని ఒప్పించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటయ్యారు. గత ఆరు నెలలుగా ఎంతో అన్యోన్యంగా గడిపారు.

    అయితే ఈ నెల ఆగస్టు 7న అనంతపురం పట్టణంలోని చల్లవారిపల్లి సమీపంలో రైలు కిందపడి రమాదేవి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు భర్తతో ప్రేమగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత రమాదేవి తల్లిదండ్రులు అల్లుడు పై ఫిర్యాదు చేశారు. అల్లుడు మంజునాథ్ వరకట్న వేధింపులు గురి చేయడం వల్లే రమాదేవి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    అయితే భార్య మరణించింది అన్న వార్త తెలుసుకున్న మంజునాథ్ ఆ మరుసటి రోజునే.. తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా దంపతులుగా మారిన ప్రేమికులు రోజు వ్యవధిలోనే తనువు చాలించడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వారు ఇంతటి కఠిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు అన్న విషయం మాత్రం బయటపడలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.