Tollywood Legends Passed Away: కృష్ణం రాజు.. సూపర్ స్టార్ కృష్ణ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ, సీనియర్ నటుడు చలపతిరావు ఇలా ఒక తరం నెమ్మదిగా కనుమరుగవుతోంది. విషాదంతాలను మర్చిపోకముందే… మరో విషాదం చోటు చేసుకుంది.. శుక్రవారం సీనియర్ నటి జమున హైదరాబాదులోని ఆమె నివాసంలో కన్నుమూశారు.. దీంతో చిత్ర పరిశ్రమ శోకసముద్రంలో మునిగిపోయింది. జమున ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హయాంలో స్టార్ నటిగా వెలుగొందిన సంగతి తెలిసిందే.

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జమున ఇంటికే పరిమితమయ్యారు.. ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం ఉదయం తిరిగిరాని లోకాలకు వెళ్లారు.. వెండితెరపై జమున నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడసరి అచ్చ తెలుగు ఆడపిల్లలా ఆమె తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.. మహానటి సావిత్రితో కలిసి హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించారు.. జమున 1936లో కర్ణాటకలోని హంపిలో జన్మించారు.. 1953లో పుట్టిల్లు చిత్రంతో నటిగా పరిచయమయ్యారు.. కెరియర్ ఆరంభంలోనే ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన నటించే అవకాశం అందుకున్నారు.. 1955లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రితో కలిసి నటించిన మిస్సమ్మ ఆల్ టైం క్లాసిక్ గా నిలిచింది.. గుండమ్మ కథ చిత్రంలో జమున నటనని ఎప్పటికీ మర్చిపోలేము..గులే బకావళి కథ, మూగమనసులు ఇలాంటి చిత్రాల్లో జమున నట విశ్వరూపం చూపింది.. కుటుంబ కథా చిత్రాలు, పౌరాణికాలు, అన్ని జోనర్స్ లో జమున తన నటనతో మెప్పించారు.. అప్పట్లో పొగరుబోతు అమ్మాయిగా నటించాలంటే గుర్తుకు వచ్చేది జమున మాత్రమే.
సత్యభామగా మీరజాలగలడా నా యానతి అనే పాటకు డాన్స్ చేయడం అంటే ఆమెకు చాలా ఇష్టం..ఆ పాటలో ఆమె హొయలు, సొగసు అన్ని తొంగి చూసేవి. ఎన్టీఆర్, ఏఎన్ ఆర్, సావిత్రితో జమునకు మంచి సాన్నిహిత్యం ఉంది.. సావిత్రి చివరి రోజుల సంఘటనలను జమున తరచూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.. తన కెరియర్లో అనేక ఫిలింఫేర్ అవార్డులను జమున సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు.. జమున భర్త పేరు జూలూరి రమణారావు.. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వీరికి సంతానం.. జమున అంత పేరు పొందిన నటి అయినప్పటికీ చిత్ర పరిశ్రమకు తన పిల్లల్ని దూరంగా ఉంచింది.

ఇంకా జమున మరణ వార్తతో టాలీవుడ్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది.. కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు ఇలా వరుసగా ఆ తరం నటులంతా తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు.. ఇప్పుడు జమున కూడా మరణించడం విషాదంగా మారింది.. జమున మృతితో ఆమె పార్దివదేహానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.. ఇక టాలీవుడ్ లో ఓ తరం నెమ్మదిగా వెళ్లిపోతోంది. జమున కూడా అలాగే నిష్క్రమించారు.. ఆత్రేయ చెప్పినట్టు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు.. ఉన్న వాళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు.. జమున తీపి గుర్తులు సినిమాల రూపంలో చాలానే ఉన్నాయి..ఉంటాయి కూడా.