
Onion Price: ఇప్పుడున్న ధరల ప్రకారం రూపాయికి ఏమొస్తుంది? పిల్లలు తినే చాక్లెట్ కూడా రాదు. కనీసం పోపు గింజల ప్యాకెట్ కూడా రాదు.. కానీ మహారాష్ట్రలో ఓ రైతు కష్టానికి అక్కడి వ్యాపారులు కట్టిన వెల రూపాయి. జస్ట్ రూపాయి.. అయ్యో పాపం రూపాయి ఇస్తే ఏమొస్తుంది? పాపం ఆయనకు ఏమి మిగులుతుంది? అనుకుంటున్నారా.. ఎస్.. మీరన్నది నిజమే. కానీ ఇక్కడ మిగులు బాటయ్యేది కేవలం వ్యాపారులకు మాత్రమే.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు.. కానీ ఆ ఉల్లి ఇప్పుడు రైతులను కన్నీరు పెట్టిస్తోంది. వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఎండనక, వాననక ఇంటిలిపాది కష్టం చేసి ఉల్లి పంటను పండిస్తే చివరకు పెట్టుబడులు కాదు కదా కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అలాంటి ఘటనే సోలాపూర్ లో జరిగింది.. మహారాష్ట్రలోని బర్శి తాలూకా బర్గన్ ప్రాంతానికి చెందిన తుకారాం చవాన్ అనే రైతు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పిన రాజకీయ నాయకుల మాటలు నమ్మి విస్తారంగా ఉల్లి పంటను సాగు చేశాడు. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు.. ఇంటిల్లిపాది కష్టం చేస్తే భారీగానే దిగుబడి వచ్చింది.. కోసిన ఆ ఉల్లిగడ్డలను బస్తాల్లో నింపి తన గ్రామానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలాపూర్ మార్కెట్ కు ఆటోలో తరలించాడు.
రెండు రూపాయలు ఇచ్చారు
అక్కడ మార్కెట్ యార్డ్ లో తాను పండించిన ఉల్లిపాయలను పోశాడు.. కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పాట మొదలుపెట్టారు.. వేలంలో కిలోకు రూపాయి చొప్పున కొనుగోలు చేశారు.. అంటే ఈ లెక్కన మొత్తం సదరు రైతుకు దక్కింది 512 రూపాయలు.. ఇక ఈ రైతుకు సంబంధించిన ఉల్లిపాయలను కొనుగోలు చేసిన వ్యాపారి రవాణా, లేబర్, తూకం కలిపి రూ.509.51 లెక్క కట్టి ఆ మొత్తం లో నుంచి తీసి ఇచ్చాడు. మిగిలిన రూ. 2.49 కి రసీదు ఇచ్చాడు. ఆపై, బ్యాంకు లావాదేవీ కోసం 49 పైసలు సర్దుబాటు చేసి రూ.2 కు ఓ చెక్కు చేతిలో పెట్టాడు.. నేను ఇన్నాళ్లు కష్టపడి పనిచేసి, పంట పండిస్తే దక్కిన ప్రతిఫలం ఇదేనా అంటూ చవాన్ ఆందోళన వ్యక్తం చేసాడు. తనలాంటి పరిస్థితి మరో రైతుకు ఎదురు కాకూడదని వాపోయాడు. రాజకీయ నాయకుల మాటలు నమ్మి ఉల్లి పంట వేస్తే నిండా మునిగిపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు.. మరోవైపు సదరు వ్యాపారి మాట్లాడుతూ చవాన్ తెచ్చిన ఉల్లి నాసిరకమైనదని, అది అంతకుమించి ధర పలకదని చెప్పాడు. అంతేకాదు లావాదేవీలు మొత్తం కంప్యూటర్ ద్వారా జరుగుతాయని, తాము రెండు రూపాయల కంటే తక్కువ మొత్తానికి కూడా చెక్కులు ఇచ్చామని చెప్పడం గమనార్హం.

20 రూపాయలకు అమ్మారు
ఇదే రైతు పండించిన ఉల్లిపాయలను కొనుగోలు చేసిన వ్యాపారులు 20 రూపాయల చొప్పున ఇతర మార్కెట్లకు తరలిస్తున్నారు. అంటే ఒక కిలో మీద 19 రూపాయల లాభాన్ని గడిస్తున్నారు.. ఇక సదరు రైతు నుంచి అన్ని ఖర్చులు మినహాయించుకొని రెండు రూపాయల విలువైన పోస్ట్ డేటెడ్ చెక్కు వ్యాపారులు అందించారు.. ఆ చెక్కు కూడా 15 రోజుల తర్వాతే చెల్లుబాటు అయ్యేలాగా ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో మన దగ్గర వరి ఎలా పండుతుందో.. అక్కడ ఉల్లి కూడా అలా సాగవుతుంది.. కాగా ఇటీవల అక్కడ స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి నాయకులు రైతులను ఉల్లిపంట వేసుకోమ్మని ప్రోత్సహించారు.. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇది నిజమే అని నమ్మిన రైతులు విస్తారంగా ఉల్లి పంటను సాగు చేశారు.. కాని తీరా పంటను విక్రయించుకునే సమయంలో ధరలు పడిపోవడంతో రైతులు నిండా మునిగిపోయారు..