Tomato Tulabharam: టమాటా ధరలు ఏ మాత్రం తగ్గకపోగా పెరుగుతున్నాయి. కిలో టమాటా రూ.300లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిని, దిగుబడి తగ్గడంతో ధరలు పెరుగుతాయని అంటున్నారు. అలాంటి టమాటాతో విచిత్రమైన విషయాలు రోజూ చూస్తున్నాం. ఇంట్లో దొంగలు పడి బంగారంతోపాటా టమాటాలు ఎత్తుకెళుతున్నారు. టమాటా లోడున్న లారీలను హైజాక్ చేస్తున్నారు. అలాగే టమాటా వ్యాపారులు బౌన్సర్లను రక్షణగా పెట్టుకున్న వార్తలు కూడా చూశాం. ఇటీవల చెన్నైలో నవ దంపతులకు టమాటా ప్యాకెట్లు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఓ యువతి బర్త్‌డేకు కూడా టమాటాలు గిఫ్ట్‌గా ఇచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇవిలా ఉంటే.. ఇక్కడ ఓ తండ్రి తన కూతురుకు టమాటాలతో తులాభారం వేయించి తానెంత రిచ్చో చాటుకున్నాడు.
నూకాలమ్మకు కానుకగా..
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో నూకాలమ్మ అమ్మవారికి భక్తులు కానుకలను సమర్పించుకుంటారు. కొందరైతే తమ కోరికలు నెరవేరితే తులాభారం ఇస్తామంటూ అమ్మవారికి మొక్కుకుంటారు. తమ కోరికలు నెరవేరిన వెంటనే తులాభారంతో అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపి వెళుతుంటారు. అయితే అనకాపల్లికి చెందిన ఒక భక్తుడు తన కూతురుకు టమాటాలతో తులాభారం వేసి ఆశ్చర్యపరిచాడు.
51 కేజీలు… తూగిన యువతి..
అనకాపల్లికి చెందిన మళ్ల జగ్గ అప్పారావు, మోహిని దంపతుల కుమార్తె భవిష్యకు నూకాలమ్మ ఆలయంలో తులాభారం జరిగింది. అయితే ఈ తులాభారం టమాటాలతో జరిగింది. 51 కేజీల టమాటాలతో తులా భారం వేశారు. కిలో టమాటా 120 రూపాయలు పలుకుతున్న ఈ సమయంలో 51 కిలోలను తులాభారం వేయడమంటే మాటలా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ టమాటాలను అమ్మవారి ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి వినియోగిస్తామని ఆలయ నిర్వాహకులు చెప్పారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రిచ్ బ్రో అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.