Chennai: పిల్లను బడికి పంపి.. తాము ఇంట్లో కూర్చుంటే సరిపోదు. ఈ వీడియో చేసిన తర్వాత మీరు కూడా నిజమే అంటారు. ఎందుకంటే స్కూల్‌కు వెళ్లే మార్గంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఒకవైపు కుక్కల బెడదతో పిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. మరోవైపు వాహనాల రద్దీ, ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఆవు బడికి వెళ్తున్న బాలికపై దాడిచేసింది. ఈ ఘటన చెన్నైలో జరిగింది. కొమ్ములతో పొడుస్తూ.. కాళ్లతో తొక్కుతూ ఆవు దాడి చేయగా, స్థానికులు స్పందించి ఆవును తరిమేసి బాలికను కాపాడారు.
స్కూల్‌కు వెళ్తుండగా..
చెన్నైకి చెందిన జాఫర్ సిద్దిఖ్ అలీ తొమ్మిదేళ్ల కూతురు అయేషా రోజూలాగే బుధవారం ఉదయం స్కూలుకు బయలుదేరింది. ఇంటి నుంచి కాలినడకన వెళుతుండగా.. ఎంఎండీఏ కాలనీలో ఆర్ బ్లాక్ వద్ద ఆయేషాపై ఆవు దాడి చేసింది. వెనక నుంచి కొమ్ములతో ఆయేషాను ఎత్తి కింద పడేసింది. ఆపై కొమ్ములతో నేలపై ఈడుస్తూ, కాళ్లతో తొక్కుతూ దాడి చేసింది. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అదిలించేందుకు ప్రయత్నించగా.. ఆవు వారిపైకి వెళ్లింది. దీంతో వారు వెనక్కి తగ్గారు. చివరకు కర్రలతో బెదిరించి ఆవును తరిమేశారు. ఈ దాడిలో ఆయేషాకు తీవ్ర గాయాలయ్యాయి.
సోషల్ మీడియాలో వైరల్..
సిటీలోని ఎంఎండీఏ కాలనీలో జరిగిన ఈ దారుణంలో తీవ్రంగా గాయపడిన బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆవు దాడి చేసిన ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. తాజాగా ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుందని ఆందోళన చెందుతున్నారు. పిల్లలను ఒంటరిగా బయటకు పంపొంద్దని మరికొందరు సూచిస్తున్నారు.