Viral News: : సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేల హడావుడి మొదలవుతుంది. దీంతో కోడి పందేలు ఏపీలో రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతటా భారీ పందేలు ఏర్పాటు చేశారు. పందేల నిర్వాహకులు అనుమతులు రాగానే పందేలను నిర్వహించారు. సోమవారం ఉదయం పదకొండు గంటల తర్వాత పందేలు ప్రారంభమైన పందేలు నేటి సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. కొంతమంది ప్రజా ప్రతినిధులు నేరుగా పందేల కోసం ఏర్పాట్లు చేయడం గమనార్హం. సంక్రాంతి పండుగ ముసుగులో జూదం ఆటలు నిర్వహించడానికి సన్నాహాలు జోరుగా జరిగాయి. ప్రధానంగా రెండు గోదావరి జిల్లాలలో కోడి పందేల కోసం పందేలు జోరుగా సాగుతున్నాయి. అనేక గ్రామాల్లో కొబ్బరి తోటలు , ఖాళీ స్థలాలను ఎంపిక చేసి ట్రాక్టర్లతో చదును చేశారు. మరోవైపు, కోడి పందేలతో పాటు ఆటలు ఆడటానికి లక్షల రూపాయల విలువైన అంతర్గత ఒప్పందాలుజరిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి. గతంలో మాదిరిగా కాకుండా అంతటా పెద్ద ఎత్తున పందేల మైదానాలను ఏర్పాటు చేయడానికి కూటమి నాయకులతో పాటు వైసీపీ నాయకులు కూడా తమ తమ హోదాల్లో రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బెట్టింగ్ మైదానాలు ఏర్పాటు చేశారు. కోడి పందేల పొలాల దగ్గర కొన్ని చోట్ల ఇప్పటికే బహిరంగంగా బెల్టు షాపులు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా పందాల మైదానాల వద్ద బహిరంగంగా మద్యం విక్రయాలు కొనసాగతున్నాయి.
ఒక్కో సారి ఏం వేయకపోవడమూ మంచిదే అన్నట్లు 5 స్టార్ చాక్లెట్ కంపెనీ యాడ్ గుర్తుందిగా సేమ్ అలాగే సంక్రాంతి పందెంలో కోడి పోరాడకుండానే గెలిచేసింది. 5 కోళ్లు బరిలో దిగగా 4 కోళ్లు ఒకదానిపై ఒకటి దాడి చేసుకుని నేలకొరిగాయి. మొదటి నుంచి ఒకే చోట సైలెంటుగా నిలుచున్న కోడి విజేతగా నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ కోడి తెలివైనదని కొందరు అంటుండగా, ఎప్పటికైనా అది కూరలా మారాల్సిందేనని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపుంజుపై రూ.కోటి పందెం కాశారు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజును, రాతయ్య రసంగి పుంజును బరిలో దింపారు. కోటి 25 లక్షలతో రెండు పుంజులను నిర్వాహకులు బరిలోకి దింపారు. కోటి రూపాయల పందాన్ని వీక్షించడానికి పందెం రాయళ్లు భారీ ఎత్తున తరలివచ్చారు. హోరా హోరిగా సాగిన పోరులో.. గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు) విజేతగా నిలిచింది.