
TS Gurukulam Notification 2023: నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో 8 ఏళ్లు గడిచినా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఎన్నికల ఏడాది భారీ ఉద్యోగాల భర్తీకి తెరలేపింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ సర్కార్‌కు మాయని మచ్చలా మారింది. ఈ క్రమంలో దానిని తొలగించుకునేందుకు, ఎన్నికల్లో నిర్యుగులు తమకు అనుకూలంగా ఓటు వేసేందుకు తాజాగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. 9వేల ఉపాధ్యాయ, అధ్యాపక ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉద్యోగాల భర్తీపై దృష్టి..
ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ అన్ని రంగాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా యువతకు ఉద్యోగాల కల్పనపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో అతిపెద్ద ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 9,231 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 4,020 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 2008 జూనియర్ లెక్చరర్లు/ఫిజికల్ డైరెక్టర్లు/జూనియర్ కాలేజీల్లో లైబ్రేరియన్ల పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించింది. 1,276 పీజీ టీచర్లు, 868 లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, డిగ్రీ కాలేజీల్లో లైబ్రేరియన్లు, స్కూళ్లలో 434 లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేస్తారు.
తొమ్మిది నోటిఫికేషన్లు..
మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల కాగా ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జూనియర్ కాలేజీలో భర్తీ చేసే పోస్టుల వివరాలు అర్హతలు ఇతరత్రా వివరాలను ఏప్రిల్ 17న వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదే సమయంలో పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, లైబ్రేరియన్, స్కూళ్లలో ఫిజికల్ డైరెక్టర్, ఆర్ట్ టీచర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు సంబంధించిన ఖాళీలు, ఇతరత్ర పూర్తి వివరాలను ఏప్రిల్ 24, ఏప్రిల్ 28వ తేదీన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఇక నిరుద్యోగులు లేదా టీచర్‌గా స్థిరపడాలనుకునేవారికి ఈ భారీ నోటిఫికేషన్ ఒక వరమే అని చెప్పాలి.

3.5 లక్షల మంది అభ్యర్థులు..
తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం 3.5 లక్షల మంది నిరీక్షిస్తున్నారు. వీరంతం బీఈడీ, డీఈడీ చేసి టెట్ క్వాలిఫై అయి ఉన్నారు. దాదాపు మూడు నెలలుగా నేడు, రేపు అంటూ నోటిఫికేషన్లపై ప్రభుత్వం ఊరిస్తూ వస్తోంది. ఎట్టకేలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులు అలర్ట్ అయ్యారు.