Mandi Biryani: పెళ్లిరోజు అంటే ఎవరికైనా ఆనందమే. తమ జీవితంలోకి వచ్చిన భాగస్వాముల సమక్షంలో పెళ్లిరోజు జరుపుకోవడం చాలామందికి గొప్ప అనుభూతి. అలాంటి అనుభూతిని తన జీవిత భాగస్వామికి అందించాలని అతడు అనుకున్నాడు. తన జీవిత భాగస్వామి తోనే కాకుండా.. తెలిసిన స్నేహితుల సమక్షంలో పెళ్లిరోజు జరుపుకోవాలని భావించాడు. వారందరికీ ఫోన్ చేసి తన ఇంటికి రప్పించుకున్నాడు. వారంతా కలిసి ఒక మండి హోటల్ కి వెళ్లారు. అక్కడ మండి బిర్యానీ తిన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్ నగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన పెళ్లిరోజు సందర్భంగా తన భార్య, స్నేహితులతో కలిసి ఓ మండి హోటల్ కు వెళ్ళాడు. అక్కడ మండి బిర్యానీ ఆర్డర్ చేసి.. వారందరికీ తినిపించాడు. గ్రిల్డ్ చికెన్, వేడివేడి బిర్యానీ తింటూ వారంతా సంబరాలు చేసుకున్నారు.. మరుసటి రోజు నుంచి వారికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. ఆ వ్యక్తి, అతడి సతీమణి.. వెంట వచ్చిన ఆరుగురు స్నేహితులు.. ఇలా ఎనిమిది మంది ఆసుపత్రి పాలయ్యారు. పరీక్షించిన వైద్యులు ఫుడ్ పాయిజన్ అయిందని గుర్తించారు. దానివల్ల వారి పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందిందని.. అది జీర్ణాశయ సంబంధిత సమస్యకు దారితీసిందని పేర్కొన్నారు. 8 మందికి చికిత్స చేసి, లక్ష రూపాయల బిల్లు వేశారు.
ఈ ఉదంతానికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హోటళ్ల పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పేరుపొందిన హోటల్లోనూ కాలం చెల్లిన సరుకులు, బూజు పట్టిన కూరగాయలు, కుళ్ళిన మాంసం, రకరకాల రసాయనాలు వాడుతున్న తీరును బయటపెడుతున్నారు. ఓవైపు దాడులు జరుగుతుండగానే.. షాద్ నగర్ ఉదంతం వెలుగులోకి రావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. బయటి తిండి సురక్షితం కాదని.. కచ్చితంగా ఇంట్లోనే తినాలనే సోయిని కలగజేస్తోంది.. అందుకే బయట తిండి తినేవారు తస్మాత్ జాగ్రత్త.. ఆ పురుగులు పట్టిన తిండి తింటే ఒళ్ళు గుల్లవుతుంది.. చివరికి ఆసుపత్రి బిల్లులు కట్టాలంటే ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది.
View this post on Instagram