Oxfam Report 2023: దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు జరుగుతున్నాయి. దావోస్ వేదికగా ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించిన వివరాలు నివ్వెరపరుస్తున్నాయి. పేదలు మరింత పేదలు కావడానికి గల కారణాలను ఆక్స్ ఫామ్ సంస్థ వెల్లడించింది. సంచలన విషయాలను ఆక్స్ ఫామ్ రిపోర్టులో ఉన్నాయి.

పేదలు మరింత పేదలుగా మారుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు అంటూ కొన్ని రాజకీయ పార్టీల మీటింగ్ లలో వింటుంటాం. కానీ అది ఎలా ?.. ఎందుకు ? అని మనలో మనం ప్రశ్నించుకోం. ప్రశ్నించుకున్నా సరే ఆర్థిక విషయాలు మన బుర్రకు అంత ఈజీగా ఎక్కవు. కానీ ఆక్స్ ఫామ్ అనే సంస్థ తన రిపోర్టులో పేదలు పేదలుగా మారడానికి, పెద్దలు గద్దల్లా మారడానికి గల కారణాలు సవివరంగా ప్రస్తావించింది. ‘సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్- ది ఇండియన్ స్టోరీ’ పేరుతో ఓ రిపోర్టు విడుదల చేసింది. ఇప్పుడీ రిపోర్టు సంచలనంగా మారింది.
మన దేశంలో 1990ల తర్వాత ఆర్థిక సంస్కరణల కారణంగా మధ్యతరగతి వర్గం పెరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఆ మధ్యతరగతి వర్గం మళ్లీ పేద వర్గంలోకి జారిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనిక కారణం సంపన్నుల కంటే అధికంగా పన్నులు చెల్లించడమే. దేశంలో మొత్తం సంపదలోని 40 శాతం సంపద.. 1 శాతం సంపన్నుల వద్ద ఉండిపోయింది. 60 శాతం సంపద 5 శాతం మంది వద్ద ఉంది. అంటే మిగిలిన 40 శాతం సంపద 95 శాతం మంది వద్ద ఉంది. 60 శాతం సంపద ఉన్న 5 శాతం మంది సంపన్నులు సామాన్యుల కంటే తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. దానికి ఉదాహరణ.. 2021-22లో వసూలైన జీఎస్టీలో 64 శాతం జీఎస్టీ పన్ను అట్టడుగున ఉన్న 50 శాతం వద్ద నుంచి వసూలు చేయబడింది.

భారత్ లోని టాప్ ధనవంతుల వద్ద దాదాపు రూ. 27.52 లక్షల కోట్ల సంపద ఉంది. 2021తో పోల్చితో వీరి సంపద దాదాపు 9 లక్షల కోట్లు పెరిగింది. కరోనతో మొదలు.. 2022 నవంబరు వరకు వీరి సంపద 121 శాతం పెరిగింది. కానీ వీరు కట్టే పన్ను మాత్రం 3 శాతమే. దీని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ప్రభుత్వం కేవలం పేదల నుంచి, మధ్యతరగతి వర్గాల నుంచే అధిక పన్నులు వసూలు చేస్తూ.. ధనవంతులకు పన్ను మినహాయింపు ఇస్తోందని.