Madhya Pradesh Onion Price: తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందంటారు పెద్దలు.. అయితే దానిని పండించే రైతులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. ఏటా ఉల్లి ధరల ప్రభావం ఐతే రైతులు కాకుంటే వినియోగదారులపై పడుతోంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటలు కొట్టుకుపోయి రైతులకు నష్టమే మిగులుతుంది. ఇదే సమయంలో ధర పెరిగి వనియోగదారులను కోకకుండానే కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక పంట బాగా పండితే.. దళారుల చేతిలో రైతులు దగా అవుతున్నారు. కనీస మద్దతు ధర కూడా దక్కక, పంటను నిల్వ చేసుకునే పరిస్థితి లేక రైతులు దళారి చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈ ఏడాది ఉల్లి రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

క్వింటాల్‌కు 70 పైసలు..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లి రైతు జయరాం పంట దిగుబడిని స్థానిక షాజాపూర్ మారన్కెటకు తీసుకెళ్లాడు. ఒక్కో బస్తాలో 50 కిలోల చొప్పున ఆరు బస్తాల్లో మూడు క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తెచ్చాడు. ఉల్లిపాయలు అమ్మగా రైతుకు రూ.330 వచ్చింది. అయితే ఉల్లిని తన ఊరి నుంచి మార్కెట్‌కు తీసుకురావడానికి రైతుకు అయిన ఖర్చు రూ.280, హమాలీ చార్జి రూ.48. ఇవిపోనూ రైతుకు మిగిలింది కేవలం రూ.2 మాత్రమే అంటే క్వింటాల్ ఉల్లికి ఖర్చులన్నీ పోనూ రైతుకు మిగిలింది 70పైసలు అన్నమాట. దీనికి సబంధించిన రశీదును రైతులు సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో అది వైరల్ అవుతోంది. దానిని చదివిన ప్రతి ఒక్కరూ రైతు శ్రమకి దక్కే ఫలితం ఇదేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. వ్యవసాయం దండగా అని ఇంకొందరు.. ఇలా అయితే రైతు రాజయ్యేది ఎప్పుడు అని మరికొందరు కామెంట్‌చేశారు. కన్నీళ్లు పెట్టుకునే తంబ్‌నేల్ ట్యాగ్ చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇక మధ్యప్రదేశ్ ఉల్లిరైతు రశీదు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు వైరల్ చేస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ఉల్లిరైతు పరిస్థితి ఇదీ అంటూ తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ నాయకులు కామెంట్ చేస్తున్నారు. రైతుబిడ్డ కేసీఆర్ ప్రధాని అయితే దేశంలో రైతులందరికీ మంచిరోజులు వస్తాయని, పంటలకు మద్దతు ధర దొరుకుతుందని పోస్టులు పెడుతున్నారు. ఇక బీజేపీ నేతలు కూడా అంతే దీటుగా సమాధానం ఇస్తూ మధ్యప్రదేశ్ రైతు పోస్టునే వైరల్ చేస్తున్నారు.

ఇక్కడ బీజేపీ నాయకులు రైతు చట్టాలు అమలయి ఉంటే రైతుల పరిస్థితి ఇలా ఉండేది కాదని పేర్కొంటున్నారు. ధరను రైతులే నిర్ణయించేవారని పోస్టు చేస్తున్నారు. విపక్షాలు రైతు చట్టాలపై తప్పుడు ప్రచారం చేయడంతో రైతులు తమకే నష్టం జరుగుతుందని వ్యతిరేకించారని దీంతో కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుందని వెల్లడిస్తున్నారు. ఆ చట్టాలే ఉండి ఉంటే.. రైతులకు మద్దతు ధరకంటే ఎక్కువ రేటుకే పంట దిగుబడి అమ్ముకునే పరిస్థితి ఉండేదని పేర్కొంటున్నారు. రాజకీయ నేతల పోస్టులు ఎలా ఉన్నా.. ఉల్లిరైతు జయరాం కష్టం, శ్రమకు దక్కిన ఫలితం మాత్రం పార్టీలకు అతీతంగా అందరినీ కదిలిస్తోంది. మరి దీనిపై పాలకులు ఎలా స్పందిస్తారు చూడాలి.