
ఈ మధ్య కాలంలో విద్యార్థులు, యువత ఆన్ లైన్ గేమ్స్ కు అడిక్ట్ అవుతున్నారు. ఈ అడిక్షన్ ఎంతలా అంటే కొందరు తినే తిండిని, నిద్రను పట్టించుకోకుండా రోజులో ఎక్కువ సమయం ఆన్ లైన్ గేమ్స్ కే పరిమితమవుతున్నారు. ఇలా విద్యార్థులు, యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్న గేమ్స్ లో పబ్ జీ ప్రథమ స్థానంలో ఉంది. ఈ గేమ్ విద్యార్థులు, యువత జీవితాలతో ఆడుకుంటోంది. ఈ మొబైల్ గేమ్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
మరికొందరు ఈ గేమ్స్ కు బానిసలై లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా పబ్ జీ గేమ్ వల్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని జాజులకుంట గ్రామానికి చెందిన 16 సంవత్సరాల బాలుడు పబ్ జీకి బానిసయ్యాడు. రోజులో చాలా సమయం పబ్ జీ గేమ్ ఆడుతూనే గడిపేసేవాడు. గేమ్ మధ్యలో ఆపడం ఇష్టం లేక ఆహారం, నీళ్లు తీసుకోవడం కూడా మానేశాడు.
కొన్ని రోజుల తర్వాత బాలుడు సరైన సమయంలో ఆహారం, నీళ్లు తీసుకోకపోవడం వల్ల అనారోగ్యం పాలయ్యాడు. వైద్యుడు బాలుడిని పరిశీలించి బాలుడు తీవ్రమైన డీహైడ్రేషన్ కు గురయ్యాడని చెప్పారు. బాలుడు చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. చేతికందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిపుణులు తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.