
సాధారణంగా 144 సెక్షన్ ను ఎలక్షన్ల సమయంలో, ఎక్కడైనా అల్లర్లు జరిగిన సమయంలో అమలు చేస్తూ ఉంటారు. అయితే కరోనా వల్ల కేరళలో 144 సెక్షన్ ను అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొదట్లో కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో సక్సెస్ అయిన కేరళలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు, రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి. ఫలితంగా అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది.
మొదట్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదైన రాష్ట్రాల్లో వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంటే కేరళలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. నిన్న ఒక్కరోజే కేరళలో 9,000 కేసులు నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. దీంతో కేరళ ప్రభుత్వం వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
నమోదవుతున్న కేసులలో మెజారిటీ కేసులు కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా బయట పడుతూ ఉండటం గమనార్హం. కేరళలో కరోనా పరీక్షలు చేయించుకున్న ప్రతి 100మందిలో 13 మందికి వైరస్ నిర్ధారణ అయింది. దీంతో ప్రభుత్వం వైరస్ నియంత్రణ చర్యల దిశగా అడుగులు వెస్తోంది. కేరళ ముఖ్య కార్యదర్శి విశ్వాస్ మెహతా ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తిరువనంతపురంలో నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది.
ఒకేచోట ఐదు మంది కంటే ఎక్కువమంది ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మార్కెట్లకు, కార్యాలయాలకు వెళ్లే వాళ్లకు మాత్రం ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చింది. కేంద్రం ఆదేశాల ప్రకారం వివాహం, అంత్యక్రియలకు అనుమతులు ఉంటాయి.