Atrocious In Hyderabad: ‘‘తెలంగాణలో ఎవరైనా మహిళపై కన్నేస్తే అతడి కళ్లు పీకేస్తాం.. మహిళల వైపు చూడాలంటే కూడా భయపడేలా పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తాం’’ ఏడేళ్ల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన వ్యాఖ్యలివి. మహిళలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, నేరం చేసిన వారిని కోర్టులు కఠినంగా శిక్షిస్తున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. మరోవైపు డ్రగ్స్, గంజాయి కేసులు పెరుగుతున్నాయి. మద్యంతోపాటు మత్తుకు బానిసవుతున్న పురుషులు మత్తులో మృగాళ్లుగా మారుతున్నారు. మహిళలపై పశువుల్లా వ్యవహరిస్తున్నారు.. తాజాగా హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలికపై.. తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మూడు నెలల తర్వాత వెలుగులోకి..
ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు అత్యాచారాన్ని వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపించారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను బెదిరించి 10 రోజుల తర్వాత మరోసారి అత్యాచారం చేశారు.
సోషల్ మీడియాలో వీడియో..
అయితే అప్పటి వీడియోను నిందితులు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం బాధితురాలి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కి తరలించే అవకాశముంది.

తాగుబోతుల తెలంగాణ..
రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా మారింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. దీంతో వీధికో మద్యం షాపు, గల్లీకో బెల్ట్‌షాపు వెలిశాయి. పగలు రాత్రి తేడా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో బంగారు తెలంగాణ అవుతుందనుకున్న రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా మారుతోంది. తాజాగా మద్యం అమ్మకాలు, తాగుబోతుల తీరుపై యువతను మద్యానికి బానిస చేస్తున్న తీరుపై సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రమాదపుటంచులో ఉందని పేర్కొంటున్నారు. నేరాల పెరుగుదలకు మద్యం, గంజాయి, డ్రగ్స్ కారణమని పేర్కొంటున్నారు. నియంత్రించాల్సిన పాలకులే ప్రోత్సహించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై లైంగిక దాడులకు, అఘాయిత్యాలకు మద్యం మత్తే కారణమని పేర్కొంటున్నారు. మత్తులో జరిగే నేరాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.