
Kurnool Police Station: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటారు.. ప్రస్తుతం అటువంటి పరిస్థితి కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ లో నెలకొంది. ఈ పోలీస్ స్టేషన్లో పనిచేసే కొంతమంది పోలీసు సిబ్బంది స్టేషన్లో దాచిన 75 లక్షల రూపాయలు విలువ చేసిన సొత్తు, నగదును తస్కరించారు. రెండేళ్ల కిందట అనధికారికంగా తీసుకు వెళుతున్న ఇద్దరు వ్యక్తులు వద్ద నుంచి సీజ్ చేసి పోలీస్ స్టేషన్లోని బీరువాలో భద్రం చేయగా.. ఆ మొత్తం ఇప్పుడు కనిపించకుండా పోయింది. రెండేళ్లుగా సీజ్ చేసిన సొమ్ము, నగదు కోసం ఎవరు ముందుకు రాకపోవడంతో దీని గురించి పట్టించుకోవడమే మానేశారు. అయితే రెండేళ్ల తర్వాత తాజాగా వీటి కోసం యజమానులు కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని రావడంతో వారికి అప్పగించేందుకు సీఐ బీరువా తలుపు తీసి చూడగా.. అందులో నగదు మాయమైంది. దీంతో స్టేషన్లోని ఇంటి దొంగలపై సర్వత్ర అనుమానం వ్యక్తం అవుతోంది. ఆ దిశగానే ఇప్పుడు ఉన్నతాధికారులు విచారణను సాగిస్తున్నారు.
కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ లో దాదాపు రూ.75 లక్షల విలువైన రెండు ఆభరణాలు నగదు మాయమైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీరువాలో దాచిన 105 కిలోల వెండి డబ్బు కనిపించకపోవడంతో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది పైన అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో ఎవరు వాటిని దొంగలించారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం. మరి ఆ పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగితే ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి. దొంగతనం చేసిన వారిని పట్టుకుని స్టేషన్లో బంధించాల్సిన పోలీసులు ఆ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఎవర్ని బంధించాలి. సరిగ్గా అలాంటి ఘటనే కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో ఇటీవల చోటుచేసుకుంది. ఏకంగా రూ.75 లక్షలు విలువైన వెండి ఆభరణాలు నగదు మాయమైన ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సీజ్ చేసి పోలీసులు స్టేషన్లో భద్రం దాచిన సొమ్ము..
కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో రూ.75 లక్షల విలువైన వెండి ఆభరణాలు నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం పంచలింగాలు చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారం నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల 5 వేల రూపాయలు నగదును సీజ్ చేశారు. ఈ మొత్తం పోలీస్ స్టేషన్లోనే భద్రం చేయగా ప్రస్తుతం అవి కనిపించకుండా పోయాయి.
అవాక్కైనా ఉన్నతాధికారులు..
సీజ్ చేసిన ఆభరణాలను, నగదును పోలీస్ స్టేషన్లో ఉన్న బీరువాలో దాచారు. ఈ క్రమంలో ఇటీవల యజమానులు న్యాయస్థానం నుంచి అనుమతి పొంది పోలీస్ స్టేషన్కు చేరుకుని వెండి, నగదు అప్పగించాలని కోరారు. దీంతో ప్రస్తుత సిఐ రామలింగయ్య బీరువా తెరిచి చూడగా బీరువాలో 105 కిలోల వెండి నగదు లేకపోవడంతో నిర్ఘాంత పోవాల్సి వచ్చింది. సొత్తు సీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు సీఐలు బదిలీ కావడంతో వారిని పిలిపించి విచారించడం మొదలుపెట్టారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సిబ్బంది పైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పోలీస్ స్టేషన్కు ఎలా వచ్చిందంటే..
2001లో జనవరి 28న కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద సెబ్ సీఐ లక్ష్మీ దుర్గయ్య వాహనాల తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారులు దాదాపు 105 కిలోల వెండి ఆభరణాలను, రూ.2 లక్షల 5 వేల నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు. అయితే వాటికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తనిఖీ చేసిన అధికారులు వెండి, నగదును సీజ్ చేసి తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పట్లో సిఐగా విధులు నిర్వహించిన విక్రమ సింహకు అప్పగించారు. దీంతో పోలీసులు ఆ వెండిని, నగదును పోలీస్ స్టేషన్లోని బీరువాలో ఉంచి ఓ మహిళా కానిస్టేబుల్ కు వాటి పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు.
ఇప్పటి వరకు ముగ్గురు సీఐలు బదిలీ..
ఆ తరువాత సిఐ విక్రమ సింహ బదిలీ అయ్యారు. అనంతరం ఆ స్టేషన్లో సీఐలుగా కంబగిరి రాముడు, శేషయ్య పనిచేసే బదిలీ అయ్యారు. ప్రస్తుత సీఐ రామలింగయ్య పనిచేస్తున్నారు. వెండి ఆభరణాలు నగదు సీజ్ చేయబడిన రోజు నుంచి ఇంత వరకు వెండి కి సంబంధించిన వ్యాపారులు స్టేషన్ కు రాలేదు. అయితే ఈ నెల 27వ తేదీన వెండి యజమానులు న్యాయస్థానం నుంచి అనుమతి పొంది కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ కు వచ్చి వెండి నగదు అప్పగించమని సిఐను అడిగారు. దీంతో సిఐ రామలింగయ్య బీరువా తెరిచి చూడగా అసలు బీరువాలో 105 కిలోల వెండి గాని, డబ్బు గాని లేకపోవడంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయారు. పోలీస్ స్టేషన్లో దాచిన వెండి నగదు కనిపించకపోవడంతో పై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు నలుగురు సిఐలు బదిలీ కావడంతో వారందరినీ పిలిపించి ప్రస్తుతం విచారిస్తున్నారు.