Simhachalam Hundi: వాహనాల ఫైనాన్స్ చెల్లించేందుకు, ఇంటు రుణం నెలవారీ కిస్తీ చెల్లించేందుకు, అప్పు ఇచ్చిన వారి బాకీ తీర్చేందుకు సాధారణంగా చెక్కులు ఇవ్వడం చూస్తుంటా. అయితే కొంత మంది తమ ఖాతాలో డబ్బులు లేకపోయినా చెక్కులు ఇచ్చి ఫలానా తేదీన బ్యాంకులో జమ చేసుకోవాలని సూచిస్తారు. ఆ ప్రకారం చెక్ వేసి డబ్బులు తీసుకుంటారు. ఒక్కోసారి ఖాతాలో నగదు లేకపోతే ఆ చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇక కొంత మంది అప్పుల వాళ్ల బాధలు భరించలేక ఖాతాలో డబ్బులు లేకపోయినా చెక్కులు ఇస్తుంటారు. తర్వాత అవి బౌన్స్ కావడం, బాధితులు కేసులు పెట్టడం జరుగతుంటాయి. కానీ, ఇక్కడ ఓ భక్తుడు సింహాద్రి అప్పన్ననే బురిడీ కొట్టించాలనుకున్నాడు. అప్పుల వాళ్లకు ఇచ్చినట్లు.. రూ.100 కోట్ల చెక్కు రాసి స్వామివారి హుండీలో వేశాడు.
హుండీలో కానుకలు..
ఆలయం అన్నాక హుండీలో భక్తులు కానుకలు సమర్పించుకోవడం పరిపాటే. కోరికలు తీరిన భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే, ఎవరి తాహతుకు తగ్గట్లుగా వారు కానుకలు సమర్పిస్తారు. కొందరు ఖరీదైన కానుకలు ఇస్తారు. బంగారం, వజ్ర వైడూర్యాలు సమర్పిస్తారు. మరికొందరు కోట్ల రూపాయల డబ్బు కానుకగా ఇస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల శ్రీవారి ఆలయంలో ఇలాంటివి సర్వసాధారణం. కానీ, విశాఖలోని సింహాద్రి అప్పన్న ఆలయంలోని హుండీలో ఏకంగా 100 కోట్ల రూపాయల చెక్ కనిపించింది. బొడ్డేపల్లి రాధాకృష్ణ పేరుతో ఆ 100 కోట్ల రూపాయల చెక్ ఉంది. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి పేరుతో చెక్ ఉంది. అంత భారీ మొత్తంతో చెక్ చూసి ఆలయ అధికారులు ఆశ్చర్యపోయారు.
అసలు విషయం తెలిసి.. అధికారుల షాక్..
అయితే అధికారులు ఆశ్చర్యం, ఆనందం ఎంతో సేపు మిగలలేదు. బుధవారం చెక్కు కనిపించడంతో దానిని బ్యాంకుకు పంపించారు. చెక్కును నగదుగా మార్చేందుకు యత్నించారు. ఈ క్రమంలో ముందుగా చెక్కువేసిన బొడ్డేపల్లి రాధాకృష్ణ బ్యాంకు ఖాతాలో ఎంత సొమ్ము ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. బ్యాంకు అధికారులు ఖాతా ఓపెన్‌చేసి చూసి ఆలయ అధికారులకు చెప్పిన విషయం ఖండుతిన్నారు.
రూ.100 కోట్ల చెక్కు.. ఖాతాలో రూ.17..
రాధాకృష్ణ బ్యాంకు బ్యాలెన్స్ కేవలం రూ.17 మాత్రమే ఉంది. కానీ హుండీలో మాత్రం రూ.100 కోట్ల చెక్కు వేశాడు. షాక్ నుంచి తేరుకున్న అధికారులు ఆ చెక్కును దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు పంపించారు. వారి ఆదేశాల మేరకు తదుపలి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.